1 మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనోచూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.౹
2 ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.౹
3 ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవి త్రునిగా చేసికొనును.౹
4 పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.౹
5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.౹
6 ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగనులేదు.౹
7 చిన్నపిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.౹
8 అపవాదిమొదటనుండి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది సంబంధి; అపవాదియొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.౹
9 దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.౹
10 దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాదిపిల్లలెవరో తేట పడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.౹
11 మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా౹
12 మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?
13 సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి.౹
14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.౹
15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.౹
16 ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.౹
17 ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?౹
18 చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.౹
19-20 ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విష యములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.౹
21 ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.౹
22 మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.౹
23 ఆయన ఆజ్ఞ యేదనగా–ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే.౹
24 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించినఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1JN/3-495b9e0ee764c684a4f8ef3c5490799c.mp3?version_id=1787—