1 ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలుదేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.౹
2 ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయుపనియే, వాటికి బలులను అర్పించువారు–దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు.౹
3 కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టువలెను, కిటికీలోగుండ పోవు పొగవలె నుందురు.౹
4 మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.౹
5 మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.౹
6 తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.౹
7 కాబట్టి నేను వారికి సింహమువంటివాడనైతిని; చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును.౹
8 పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడునట్టు నేను వారిమీదపడి వారి రొమ్మును చీల్చివేయుదును; ఆడుసింహము ఒకని మ్రింగివేయునట్లు వారిని మ్రింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.౹
9 ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.౹
10 నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? –రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?
11 కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను.౹
12 ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.౹
13 ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.౹
14 అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.౹
15 నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించుగాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపట్టును.౹
16 షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/13-79a198f1e858eed5711ac31aaea66384.mp3?version_id=1787—