1 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.౹
2 అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి–మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుటయుక్తముకాదు.౹
3 కాబట్టి సహోదరులారా,ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;౹
4 అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.౹
5 ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందునవారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్ప రచుకొని౹
6 వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.
7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.
8 స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను.౹
9 అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని౹
10 మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించినఆత్మను వారెదిరింపలేకపోయిరి.౹
11 అప్పుడు వారు–వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని౹
12 ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి౹
13 అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు–ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు.౹
14 ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.౹
15 సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/6-b67d024516feeca9bb8d750cedd57da6.mp3?version_id=1787—