1 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని౹
2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.౹
3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు.౹
4 అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయములసైనికులకు అతనిని అప్పగించెను.౹
5 పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.౹
6 హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.౹
7 ఇదిగోప్రభువుదూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను.౹
8 అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత –నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.౹
9 అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.౹
10 మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.
11 పేతురుకు తెలివివచ్చి–ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.౹
12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి.౹
13 అతడు తలవాకిటి తలుపుతట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.౹
14 ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి–పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.౹
15 అందుకు వారు–నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు–అతని దూత అనిరి.౹
16 పేతురు ఇంకనుతట్టుచున్నందునవారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.౹
17 అతడు–ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి – యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను.౹
18 తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.౹
19 హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.
20 తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.౹
21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా౹
22 జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.౹
23 అతడు దేవుని మహిమపరచనందున వెంటనేప్రభువుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
24 దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
25 బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/12-c71455c9587c36bfee1b9d79ad96c20a.mp3?version_id=1787—