1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా . వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను౹
2-3 గనుక పౌలు తనవాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి–క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతిదినములుతర్కించుచుండెను.౹
4 వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగలస్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.౹
5 అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.౹
6 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి – భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు.౹
7 వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.౹
8 ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.౹
9 వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి.
10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.౹
11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.౹
12 అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.౹
13 అయితే బెరయలో కూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.౹
14 వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.౹
15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణమువరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
16 పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.౹
17 కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.౹
18 ఎపికూరీయులలోనుస్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు–ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునరుత్థానమునుగూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు–వీడు అన్యదేవతలనుప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.౹
19 అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయి–నీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?౹
20 కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరు చున్నామని చెప్పిరి.౹
21 ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.౹
22 పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా
–ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.౹
23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద–తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.౹
24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.౹
25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.౹
26-27 మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.౹
28 మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె–మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.౹
29 కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.౹
30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.౹
31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
32 మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరు–దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.౹
33 ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.౹
34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/17-f84d61b4494719c2e1eef78c0099a70d.mp3?version_id=1787—