Categories
రోమా

రోమా 5

1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము౹

2 మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.౹

3-4 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణనుకలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడు దము.౹

5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.౹

6 ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.౹

7 నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.౹

8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.౹

9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.౹

10 ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹

11 అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.

12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.౹

13 ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.౹

14 అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషేవరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,౹

15 అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.౹

16 మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.౹

17 మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.౹

18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.౹

19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.౹

20-21 మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ROM/5-69f151aacf66627d1f267a5b0707177b.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *