1 మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గల వాటినిగా చేయవలెను.౹
2 ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.౹
3 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.౹
4 తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.౹
5 ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.౹
6 మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.౹
7 మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.౹
8 ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.౹
9 అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.౹
10 తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.౹
11 మరియు ఏబది యిత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను.౹
12 ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.౹
13 మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.౹
14 మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.
15 మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.౹
16 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.౹
17 ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.౹
18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.౹
19 మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.౹
20-21 మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున, ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను.౹
22 పడమటితట్టు మందిరముయొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.౹
23 మరియు ఆ వెనుక ప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.౹
24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరముదనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.౹
25 పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను.౹
26 తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరముయొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును
27 మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;౹
28 ఆ పలకలమధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరియుండవలెను.౹
29 ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.౹
30 అప్పుడు కొండమీద నీకు కనుపరచబడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
31 మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.౹
32 తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగా రువి వాటి దిమ్మలు వెండివి.౹
33 ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.౹
34 అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.౹
35 అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.౹
36 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.౹
37 ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/26-660e21714e6b98d0d4badcdec71d1f1d.mp3?version_id=1787—