Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 19

1 నీ దేవుడైన యెహోవా యెవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని, వారి పట్టణములలోను వారి యిండ్లలోను నివసించునప్పుడు

2 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలెను.౹

3 ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశముయొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను.౹

4 పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక

5 పొరబాటున వాని చంపినయెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలివాడు చనిపోయినయెడల,వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక

6 వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండు చుండగా, మార్గము దూరమైనందునవాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.౹

7 అందుచేతను–మూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.౹

8 మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణముచేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి, నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్తదేశమును నీకిచ్చినయెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు

9 నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకాజ్ఞాపించిన యీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు, ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను.౹

10 ప్రాణము తీసిన దోషము నీమీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషియొక్క ప్రాణము తీయకుండవలెను.౹

11 ఒకడు తన పొరుగువానియందు పగ పెట్టి వానికొరకు పొంచియుండి వానిమీదపడివాడు చచ్చునట్లు కొట్టి

12 ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయినయెడల, వాని ఊరిపెద్దలు మనుష్యులను పంపి అక్కడనుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్యచేయువానిచేతికి వాని నప్పగింపవలెను.౹

13 వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయులమధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను.

14 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.

15 ఒకడుచేయు సమస్త పాపములలో ఏ అపరాధమునుగూర్చియేగాని యే పాపమునుగూర్చియేగాని ఒక సాక్షియొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.౹

16 అన్యాయపు సాక్ష్యము ఒకనిమీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల

17 ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను.౹

18 ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీదవాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైనయెడల,వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.౹

19 అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరించుదురు.౹

20 మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.౹

21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/19-277bcb19cd54f128a7f92a0a0e7fdb05.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *