Categories
2 రాజులు

2 రాజులు 9

1 అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేతపట్టుకొని రామో త్గిలాదునకు పోయి

2 అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరులమధ్యనుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొనిపోయి

3 తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి–నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.౹

4 యౌవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చునప్పటికి సైన్యాధిపతులు కూర్చుని యుండిరి.౹

5 అప్పుడతడు–అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూ–యిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు–అధిపతీ నిన్నుగూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశించెను.౹

6 అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను–ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.౹

7 కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానినిబట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానినిబట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.౹

8 అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండ అందరిని నిర్మూలము చేయుము.౹

9 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.౹

10 యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.౹

11 యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడు–ఏమి సంభవించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు–వానిని వాని మాటలు మీరెరిగే యున్నారని చెప్పెను.౹

12 కాబట్టి వారు–అదంతయు వట్టిది; జరిగినదానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను– నను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను.౹

13 అంతట వారు అతివేగిరముగా తమతమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించి–యెహూ రాజైయున్నాడని చాటించిరి.౹

14 ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియారాజైన హజాయేలును ఎదిరించుటకై రామో త్గిలాదు దగ్గర కావలియుండిరి.౹

15 అయితే యెహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ–నీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి

16 రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పెట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.౹

17 యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి–సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి–వారిని ఎదుర్కొనబోయి–సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.౹

18 కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కిపోయి అతనిని ఎదుర్కొని – సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు–పంపబడినవాడు వారిని కలిసికొనెనుగాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.౹

19 రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి–సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.౹

20 అప్పుడు కావలివాడు–వీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్న దనెను.౹

21 –రథము సిద్ధముచేయుమని యెహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమతమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.౹

22 అంతట యెహోరాము యెహూను చూచి–యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ–నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను.౹

23 యెహోరాము రథము త్రిప్పి–అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.౹

24 అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.౹

25 కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను–అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.౹

26 అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు కాబట్టి నీవు యెహోవా మాటచొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.౹

27 యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.౹

28 అప్పుడు అతని సేవకులు అతనిని రథముమీద వేసి యెరూషలేమునకు తీసికొనిపోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి.

29 అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలు బడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏల నారంభించెను.

30 యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా

31 యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి–నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

32 అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి–నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.౹

33 –దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను.౹

34 అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత–ఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా

35 వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.౹

36 వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను –ఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.౹

37 యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలెనుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున యిది జరిగెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/9-e89b5237909b3076a322e264364f5e79.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *