Categories
2 రాజులు

2 రాజులు 16

1 రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను.౹

2 ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.౹

3 అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలుచేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.౹

4 మరియు అతడు ఉన్నతస్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.౹

5 సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరిగాని అతనిని జయింపలేక పోయిరి.౹

6 ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.౹

7 ఇట్లుండగా ఆహాజు యెహోవామందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి

8 –నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా

9 అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.౹

10 రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.౹

11 కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.౹

12 అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి

13 దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.౹

14 మరియు యెహోవా సన్నిధినున్న యిత్తడి బలిపీఠమును మందిరము ముంగిటిస్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.౹

15 అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగా–ఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజుచేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.౹

16 కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను.౹

17 మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీద నున్న తొట్టిని తొలగించెను, ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను.౹

18 మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను.౹

19 ఆహాజుచేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

20 ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/16-485ffdeefbfd61a471f5c5911da42a99.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *