Categories
సామెతలు

సామెతలు 19

1 బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె

యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.

2 ఒకడు తెలివిలేకుండుట మంచిది కాదు

తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును.

3 ఒకనిమూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును

అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.

4 ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు,

దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును.

5 కూటసాక్షి శిక్ష నొందకపోడు

అబద్ధములాడువాడు తప్పించుకొనడు.

6 అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు

దాతకు అందరు స్నేహితులే.

7 బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు

అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు

వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.

8 బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి

వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.

9 కూటసాక్షి శిక్షనొందకపోడు

అబద్ధములాడువాడు నశించును.

10 భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు

రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.

11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును

తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

12 రాజు కోపము సింహగర్జనవంటిది

అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.

13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు

తెచ్చును

భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.

14 గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము

సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.

15 సోమరితనము గాఢనిద్రలో పడవేయును

సోమరివాడు పస్తు పడియుండును.

16 ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు

తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు

చచ్చును.

17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు

వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము

చేయును.

18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము

అయితే వాడు చావవలెనని కోరవద్దు.

19 మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు

వాని తప్పించినను వాడు మరల కోపించుచునే

యుండును.

20 నీవు ముందుకు జ్ఞానివగుటకై

ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.

21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా

పుట్టును

యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

22 కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును

అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.

23 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ

సాధనము

అది కలిగినవాడు తృప్తుడై అపాయములేకుండ

బ్రదుకును.

24 సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని

తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.

25 అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు

వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.

26 తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు

అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.

27 నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు

మీరగోరితివా?

ఉపదేశము వినుట ఇక మానుకొనుము.

28 వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును

భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.

29 అపహాసకులకు తీర్పులును

బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/19-a9d13db48b1c33ea5ce72d19eca029d2.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *