1 సుగంధతైలముకంటె మంచిపేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.౹
2 విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.౹
3 నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.౹
4 జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.౹
5 బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు.౹
6 ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము.౹
7 అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును.౹
8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు
9 ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.౹
10 ఈ దినములకంటెమునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు
11 జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.౹
12 జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.౹
13 దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును?
14 సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.
15 నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు.౹
16 అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసి కొందువు?
17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు; నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?
18 నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయివిడువకుండుటయు మేలు; దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును.
19 పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.౹
20 పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.౹
21 నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.౹
22 నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా.
23 ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.౹
24 సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు
25 వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుటకును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని.౹
26 మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ ; దేవునిదృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.౹
27 సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది.౹
28 అదేదనగా వెయ్యిమంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.౹
29 ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ECC/7-e36ad13a50a69162a77905b97f060f03.mp3?version_id=1787—