Categories
లూకా

లూకా 8

1 వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా

2 పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్ర్తీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి.

3 వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారముచేయుచు వచ్చిరి.

4 బహుజనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను

5 –విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను.

6 మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను.

7 మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను.

8 మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు–వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను.

9 ఆయన శిష్యులు–ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా

10 ఆయన–దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి.)

11 ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.

12 త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాదివచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును.

13 రాతినేలనుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు.

14 ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.

15 మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.

16 ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును.

17 తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయ బడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు.

18 కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.

19 ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి.

20 అప్పుడు–నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.

21 అందుకాయన–దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.

22 మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.

23 వారు వెళ్లుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందునవారు అపాయకరమైన స్థితిలో ఉండిరి

24 గనుక ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను.

25 అప్పుడాయన –మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి–ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి.

26 వారు గలిలయకు ఎదురుగాఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి.

27 ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపెట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.

28 వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడి–యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను.

29 ఏలయనగా ఆయన–ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను.

30-31 యేసు–నీ పేరేమని వానినడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.

32 అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.

33 అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.

34 మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.

35 జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.

36 అది చూచినవారు దయ్యములు పెట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా

37-38 గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతోకూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.

39 అయితే ఆయన–నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.

40 జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.

41 అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీదపడి

42 యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తనయొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.

43 అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్ర్తీయెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి

44 ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.

45 –నన్నుముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును–మేమెరుగమన్నప్పుడు, పేతురు–ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా

46 యేసు–ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను.

47 తాను మరుగై యుండలేదని, ఆ స్ర్తీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను.

48 అందుకాయన–కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.

49 ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను.

50 యేసు ఆ మాటవిని–భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి

51 యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.

52 అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో –ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను.

53 ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి.

54 అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని –చిన్నదానా, లెమ్మని చెప్పగా

55 ఆమె ప్రాణము తిరిగివచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన –ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.

56 ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన– జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/8-614e77433a94139c6cab07f3ede6aac1.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 9

1 ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి

2 దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను.

3 మరియు ఆయన–మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు.

4 మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.

5 మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.

6 వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థ పరచుచు గ్రామములలో సంచారము చేసిరి.

7 చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు–యోహాను మృతులలోనుండి లేచెననియు,

8 కొందరు–ఏలీయా కనబడెననియు; కొందరు–పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.

9 అప్పుడు హేరోదు–నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.

10 అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.

11 జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను.

12 ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి–మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపెట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.

13 ఆయన–మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు–మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.

14-15 వచ్చినవారు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు. ఆయన–వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.

16 అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.

17 వారందరుతిని తృప్తి పొం దిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.

18 ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. –నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా

19 వారు– బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు– ఏలీయాయనియు, కొందరు– పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి.

20 అందుకాయనమీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు–నీవు దేవుని క్రీస్తువనెను.

21 ఆయన –ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి

22 మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని చెప్పెను.

23 మరియు ఆయన అందరితో ఇట్లనెను –ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

24 తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.

25 ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?

26 నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధదూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.

27 ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.

28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.

29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.

30 మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు.

31 వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి.

32 పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి.

33 (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో–ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.

34 అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.

35 మరియు– ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు,ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

36 ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి.

37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.

38 ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.

39 ఇదిగో ఒక దయ్యమువాని పట్టును, పెట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును.

40 దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

41 అందుకు యేసు –విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, నేనెంతకాలము మీతోకూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను.

42 వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.

43 గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.

44 ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన–ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.

45 అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.

46 తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా

47 యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.

48 –ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను.

49 యోహాను–ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.

50 అందుకు యేసు – మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.

51 ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు

52 ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని

53 ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు.

54-55 శిష్యులైన యాకోబును యోహానును అది చూచి–ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లుమేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.

56 అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.

57 వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడు–నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.

58 అందుకు యేసు–నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.

59 ఆయన మరియొకనితో–నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను

60 అందుకాయనమృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను.

61 మరియొకడు –ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా

62 యేసు–నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/9-72e3c3e4be12f8b867bb370de33036ed.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 10

1 అటుతరువాతప్రభువుడెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.

2 పంపినప్పుడాయన వారితో ఇట్లనెను–కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.

3 మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.

4 మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు;

5 త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు–ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.

6 సమాధానపాత్రుడుఅక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.

7 వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.

8 మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి.

9 అందులో నున్న రోగులను స్వస్థపరచుడి–దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.

10 మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయినయెడల

11 మీరు దాని వీధులలోనికి పోయి–మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి.

12 ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.

13 అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు.

14 అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును.

15 ఓ కపెర్నహూమా, ఆకా శము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు.

16 మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను.

17 ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి –ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా

18 ఆయన–సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని.

19 ఇదిగో పాము లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.

20 అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.

21 ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను.

22 సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునోవాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.

23 అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి–మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;

24 అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.

25 ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి– బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.

26 అందు కాయన–ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా

27 అతడు–నీ దేవుడైనప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను.

28 అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.

29 అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు–అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను.

30 అందుకు యేసు ఇట్లనెను–ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి.

31 అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను.

32 ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను.

33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి

34 అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను.

35 మరునాడతడు రెండు దేనారములుతీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను.

36 కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు–అతనిమీద జాలి పడినవాడే అనెను.

37 అందుకు యేసు–నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.

38 అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్ర్తీ ఆయనను తన యింట చేర్చుకొనెను.

39 ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.

40 మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.

41 అందుకుప్రభువు–మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే

42 మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/10-b734553cfac4f5121af541ec591a4d27.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 11

1 ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రాౖర్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు– ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను.

2 అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక,

3 మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;

4 మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.

5 మరియు ఆయన వారితో ఇట్లనెను–మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి–స్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము;

6 నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల

7 అతడు లోపలనేయుండినన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?

8 అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.

9 అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును;తట్టుడి, మీకు తీయబడును.

10 అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.

11 మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా?

12 కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా

13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

14 ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.

15 అయితే వారిలో కొందరు–వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి.

16 మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి.

17 ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను–తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.

18 సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.

19 నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు.

20 అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.

21 బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.

22 అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.

23 నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.

24 అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని

25 వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి

26 వెళ్లి, తనకంటె చెడ్డైవెన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను.

27 ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్ర్తీ ఆయనను చూచి–నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా

28 ఆయనఅవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.

29 మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెను–ఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచకక్రియ నడుగుచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు.

30 యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.

31 దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితోకూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.

32 నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితోకూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.

33 ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.

34 నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.

35 కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము.

36 ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.

37 ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతోకూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను.

38 ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.

39 అందుకు ప్రభువిట్లనెను–పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది.

40 అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా?

41 కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును.

42 అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది.

43 అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు.

44 అయ్యో, మీరు కనబడని సమా ధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను.

45 అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు – బోధకుడా, యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా

46 ఆయన–అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.

47 అయ్యో, మీపితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.

48 కావున మీరు సాక్షులై మీపితరుల కార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు.

49 అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా–నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.

50 వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.

51 కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకునుమధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను.

52 అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.

53-54 ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/11-9eb59b50cabb1d82c52aecbc43f89dd0.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 12

1 అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను–పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.

2 మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు.

3 అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును.

4 నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా– దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి.

5 ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.

6 అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.

7 మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?

8 మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.

9 మనుష్యులయెదుట నన్ను ఎరుగననువానిని, నేనును ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును.

10 మనుష్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు.

11 వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు మీరు–ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదుమా అని చింతింపకుడి,

12 మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.

13 ఆ జనసమూహములో ఒకడు–బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా

14 ఆయన–ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను.

15 మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.

16 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.

17 అప్పుడతడు–నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని – నేనీలాగు చేతును;

18 నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని

19 నా ప్రాణముతో – ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను.

20 అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను.

21 దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.

22 అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి.

23 ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?

24 కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.

25 మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు?

26 కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల?

27 పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతోకూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.

28 నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.

29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.

30 ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.

31 మీరైతే ఆయన రాజ్యమునువెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును.

32 చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది

33 మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించు కొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు

34 మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.

35 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి.

36 తమప్రభువుపెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.

37 ప్రభువువచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

38 మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.

39 దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.

40 మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.

41 అప్పుడు పేతురు–ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా

42 ప్రభువుఇట్లనెను–తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?

43 ఎవనిప్రభువువచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

44 అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను.

45 అయితే ఆ దాసుడు–నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే

46 వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును.

47 తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపకఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.

48 అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.

49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.

50 అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.

51 నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు; భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను.

52 ఇప్పటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.

53 తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.

54 మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను– మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు –వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును.

55 దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును.

56 వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల?

57 ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?

58 వాదించువానితోకూడ అధికారియొద్దకు నీవు వెళ్లుచుండగా అతనిచేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము, లేదా, అతడొకవేళ నిన్ను న్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును.

59 నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/12-f9e45f30af2bd03724425422309fee6d.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 13

1 పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా

2 ఆయన వారితో ఇట్లనెను–ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందునవారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా?

3 కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.

4 మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?

5 కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.

6 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి నప్పుడు ఏమియు దొరకలేదు

7 గనుక అతడు–ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను.

8 అయితే వాడు–అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము;

9 అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.

10 విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు

11 పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యముపెట్టిన యొక స్ర్తీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.

12 యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి–అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి

13 ఆమెమీద చేతులుంచ గానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.

14 యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి–పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.

15 అందుకు ప్రభువు–వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లు పెట్టును గదా.

16 ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను.

17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.

18 ఆయన–దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును?

19 ఒక మనుష్యుడు తీసికొనిపోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించెననెను.

20 మరల ఆయన–దేవుని రాజ్యమును దేనితో పోల్తును?

21 ఒక స్ర్తీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను.

22 ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను.

23 ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా

24 ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.

25 ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు

26 ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు.

27 అప్పుడాయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును.

28 అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.

29 మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు.

30 ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.

31 ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి–నీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా

32 ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి– ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవదినమున పూర్ణ సిద్ధి పొందెదను.

33 అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు.

34 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి.

35 ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది–ప్రభువుపేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/13-6730c0cb99b28e782ba16692f567274b.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 14

1 విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి.

2 అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను.

3-4 యేసు–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి

5 –మీలో ఎవని గాడిదయైననుఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడిగెను.

6 ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.

7 పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

8 –నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా

9 నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి –ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.

10 అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి–స్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండువారందరియెదుట నీకు ఘనత కలుగును.

11 తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

12 మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను– నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుప కారము కలుగును.

13 అయితే నీవు విందుచేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.

14 నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

15 ఆయనతోకూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు విని–దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా

16 ఆయన అతనితో నిట్లనెను–ఒక మనుష్యుడు గొప్ప విందుచేయించి అనేకులను పిలిచెను.

17 విందుకాలమందు అతడు – ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.

18 అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు– నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాననెను.

19 మరియొకడు–నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.

20 మరి యొకడు – నేనొక స్ర్తీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.

21 అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి–నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీను లను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను.

22 అంతట దాసుడు–ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను.

23 అందుకు యజమానుడు–నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;

24 ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.

25-26 బహుజనసమూహములు ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి–ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.

27 మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.

28 మీలో ఎవడైనను ఒక గోపురముకట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?

29 చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున

30 చూచువారందరు–ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.

31 మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేలమందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?

32 శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.

33 ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.

34 ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?

35 అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/14-21b834ba16a765403df96677f683da67.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 15

1 ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా

2 పరిసయ్యులును శాస్త్రులును అది చూచి–ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనముచేయుచున్నాడని చాల సణుగుకొనిరి.

3 అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను

4 –మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలుకలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?

5 అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి

6 –మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా.

7 అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.

8 ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?

9 అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి –నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా.

10 అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.

11 మరియు ఆయన ఇట్లనెను–ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.

12 వారిలో చిన్నవాడు–తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.

13 కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.

14-15 అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.

16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.

17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.

18 నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;

19 ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.

20 వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.

21 అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

22 అయితే తండ్రి తన దాసులను చూచి –ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;

23 క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;

24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.

25 అప్పుడు అతని పెద్దకుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని

26 దాసులలో ఒకని పిలిచి–ఇవి ఏమిటని అడుగగా

27 ఆ దాసుడు అతనితో–నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను.

28 అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను.

29 అందుకతడు తన తండ్రితో–ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు.

30 అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను.

31 అందుకతడు–కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,

32 మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/15-3c1b9466dd82b058db08d47f46f85f8d.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 16

1 మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఒక. ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా

2 అతడు వాని పిలిపించి– నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.

3 ఆ గృహనిర్వాహకుడు తనలో తాను–నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను.

4 నన్ను ఈ గృహనిర్వాహ కత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని,

5 తన యజమానుని ఋణస్థులలో ఒక్కొక్కని పిలిపించి–నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను.

6 వాడు– నూరు మణుగుల నూనె అని చెప్పగా–నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను.

7 తరువాత వాడు–నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు– నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో–నీవు నీ చీటి తీసికొనియెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను.

8 అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటెఈ లోక సంబంధులుతమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు.

9 అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.

10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

11 కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?

12 మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?

13 ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను.

14 ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా

15 ఆయన–మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవునిదృష్టికి అసహ్యము.

16 యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు

17 ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.

18 తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు.

19 ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు.

20 లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి

21 అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.

22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

23 అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి

24 –తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.

25 అందుకు అబ్రాహాము – కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.

26 అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.

27 అప్పుడతడు–తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.

28 వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.

29 అందుకు అబ్రాహాము–వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా

30 అతడు–తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.

31 అందుకతడు–మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/16-9a35b40dd3e0432714feab960a742061.mp3?version_id=1787—

Categories
లూకా

లూకా 17

1 ఆయన తన శిష్యులతో ఇట్లనెను–అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ.

2 వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.

3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము.

4 అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగి–మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను.

5 అపొస్తలులు–మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా

6 ప్రభువు–మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.

7 దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు–నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు.

8 అంతేకాక–నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని

9 ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా?

10 అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత – మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

11 ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయలమధ్యగా వెళ్లుచుండెను.

12 ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి

13 –యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.

14 ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి.

15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి

16 గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.

17 అందుకు యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?

18 ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి

19 –నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.

20 దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన–దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.

21 ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను.

22 మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు.

23 వారు–ఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి.

24 ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును.

25 అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను.

26 నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.

27 నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను.

28 లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.

29 అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.

30 ఆప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.

31 ఆ దినమున మిద్దెమీదఉండు వాడు ఇంటఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు.

32 లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.

33 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును.

34 ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును.

35-37 ఇద్దరు స్ర్తీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను. శిష్యులు–ప్రభువా, యిది ఎక్కడ (జరుగు) నని ఆయన నడిగినందుకు ఆయన–పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LUK/17-9542672693169dd931076fe76c868f3a.mp3?version_id=1787—