Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 31

1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను

2 –చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.౹

3-5 విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసియున్నాను.౹

6 మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను.౹

7 ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటిని

8 బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని ధూపవేదికను

9 దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను

10 యాజకసేవచేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోనుయొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను

11 అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.

12-13 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులతో–నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.౹

14 కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.౹

15 ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.౹

16 ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతిదినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన.౹

17 నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.

18 మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/31-3cc7bb1b8dfc25e13994fb442d1b0e9f.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 32

1 మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి –లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.౹

2 అందుకు అహరోను–మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా

3 ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.౹

4 అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు–ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.౹

5 అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠముకట్టించెను. మరియు అహరోను–రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా

6 మరునాడు వారు ఉదయమున లేచి దహనబలులను సమాధానబలులనర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.

7 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.౹

8 నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి–ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.౹

9 మరియు యెహోవా ఇట్లనెను–నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.౹

10 కావున నీవు ఊరకుండుము; నాకోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా

11 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని–యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?

12 –ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము.౹

13 నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో–ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.౹

14 అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను.

15 మోషే శాసనములుగల రెండు పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.౹

16 ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకలమీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.౹

17 ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని–పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా

18 అతడు–అది జయధ్వనికాదు, అపజయధ్వనికాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.౹

19 అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను.౹

20 మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.౹

21 అప్పుడు మోషే–నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లువారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా

22 అహరోను–నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు.౹

23 వారు–మాకు ముందునడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి.౹

24 అందుకు నేను–ఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను.౹

25 ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచి పెట్టి యుండెను.౹

26 అందుకు మోషే పాళెముయొక్క ద్వారమున నిలిచి–యెహోవా పక్షమున నున్నవారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.౹

27 అతడు వారిని చూచి–మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా డనెను.౹

28 లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి.౹

29 ఏలయనగా మోషే వారిని చూచి–నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను.౹

30 మరునాడు మోషే ప్రజలతో–మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.౹

31 అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి–అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.౹

32 అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములోనుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.౹

33 అందుకు యెహోవా–యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును.౹

34 కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పినచోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.౹

35 అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవావారిని బాధపెట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/32-08e01a481049f61f2056d3b7d4dc4dfa.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 33

1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి–నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.౹

2 నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.౹

3 మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతోకూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను.౹

4 ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.౹

5 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులతో–మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.౹

6 కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.

7 అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను.౹

8 మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారములోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచు చుండెను.౹

9 మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.౹

10 ప్రజలందరు ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుటచూచి, లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి.౹

11 మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు.

12 మోషే యెహోవాతో ఇట్లనెను–చూడుము–ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావుగాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు–నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.౹

13 కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగినయెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.౹

14 అందుకు ఆయన–నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా

15 మోషే–నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.౹

16 నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.

17 కాగా యెహోవా–నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా

18 అతడు–దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా

19 ఆయన–నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరు ణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.౹

20 మరియు ఆయన–నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.౹

21 మరియు యెహోవా–ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.౹

22 నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను;౹

23 నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/33-e8132b6564ded99b2e75e1638e7f7af5.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 34

1 మరియు యెహోవా మోషేతో–మొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.౹

2 ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరముమీద నా సన్నిధిని నిలిచియుండవలెను.౹

3 ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండమీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.౹

4 కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా

5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.౹

6 అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా

7 ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.౹

8 అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి

9 –ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మామధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొను మనెను

10 అందుకు ఆయన–ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను; భూమిమీద ఎక్కడనైనను ఏజనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు. నేను నీయెడల చేయబోవునది భయంకరమైనది.౹

11 నేడు నేను నీ కాజ్ఞా పించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీ యులను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్ల గొట్టెదను.౹

12 నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.౹

13 కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలెను.౹

14 ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.౹

15 ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినయెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.౹

16 మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.౹

17 పోతపోసిన దేవతలను చేసికొన వలదు.౹

18 మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.౹

19 ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయేగాని గొఱ్ఱెపిల్లయేగాని అది నాదగును

20 గొఱ్ఱెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు వట్టిచేతులతో కనబడవలదు.౹

21 ఆరు దినములు నీవు పనిచేసి యేడవదినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను.౹

22 మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.౹

23 సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను

24 ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశిం పడు.౹

25 నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.౹

26 నీ భూమియొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను.౹

27 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.౹

28 అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతోకూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.

29 మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములుగల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.౹

30 అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.౹

31 మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాటలాడెను.౹

32 అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికాజ్ఞాపించెను.౹

33 మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖముమీద ముసుకు వేసికొనెను.౹

34 అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడినదానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను.౹

35 మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/34-e715595571f2233ef7b5c52e6f37267b.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 35

1 మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగు చేసి–మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధు లేవనగా

2 ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్షనొందును.౹

3 విశ్రాంతిదినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.

4 మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లనెను–యెహోవా ఆజ్ఞాపించినదేమనగా

5 –మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,౹

6 నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు,౹

7-8 ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ, ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు,౹

9 ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.౹

10 మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.౹

11 అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.౹

12 మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పు తెర,౹

13 బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,౹

14 వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము

15 ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిరద్వారమున ద్వారమునకు తెర.౹

16 దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట

17 ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర

18 మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు

19 పరిశుద్ధస్థలములో సేవచేయుటకు సేవావస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములునవియే అనెను.

20 ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను.౹

21 తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.౹

22 స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళములను, సమస్తవిధమైన బంగారు వస్తువులను తెచ్చిరి.౹

23 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి.౹

24 వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనోవాడు దాని తెచ్చెను.౹

25 మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.౹

26 ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.౹

27 ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను

28 సుగంధద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి.౹

29 మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.

30-33 మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను– చూడుడి; యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.౹

34 అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.౹

35 చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపనిచేయువాడేమి నేతగా డేమిచేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/35-963da06f993216d149e2eb10b94aad28.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 36

1 పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.౹

2 బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరిని మోషే పిలిపించెను.౹

3 ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి.౹

4 అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయుచేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి

5 మోషేతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా

6 మోషే–పరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది

7 గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి.

8 ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.౹

9 ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే.౹

10 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను.౹

11 మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను.౹

12 ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను.౹

13 మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను.

14 మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుకలతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగా చేసెను.౹

15-16 ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు; ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.౹

17 మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను.౹

18 ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.౹

19 మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను.

20 మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.౹

21 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.౹

22 ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మందిరముయొక్క పలకలన్నిటికి చేసెను.౹

23 కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.౹

24 ఒక్కొక్క పలకక్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.౹

25-26 మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను.౹

27 పడమటి దిక్కున మందిరముయొక్క వెనుకప్రక్కను ఆరు పలకలు చేసెను.౹

28 వెనుకప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేసెను.౹

29 అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.౹

30 ఎనిమిది పలకలుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను.౹

31 మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒక ప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను

32 మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరముయొక్క వెనుకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.౹

33 పలకలమధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను.౹

34 ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను.

35 మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డ తెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారుని పనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను.౹

36 దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను.

37 మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పని యైన అడ్డ తెరను చేసెను.౹

38 దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/36-60f7733f1fa37bdd7d5af7fc7712f6ea.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 37

1 మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.౹

2 లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.౹

3 దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను.౹

4 మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి

5 మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.౹

6 మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర;౹

7 మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను.౹

8 ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను.౹

9 ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను.

10 మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర.౹

11 అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను;౹

12 దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టు బంగారు జవను చేసెను.౹

13 దానికి నాలుగు బంగారు ఉంగ రములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను.౹

14 బల్లను మోయుటకు మోతకఱ్ఱలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను.౹

15 బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను.౹

16 మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను.

17 అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషిపనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి.౹

18 దీపవృక్షముయొక్క ఇరుప్రక్కలనుండి మూడేసికొమ్మలు అట్లు దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి.౹

19 ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదమురూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను.౹

20 మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదమురూపమైన నాలుగు కలశము లుండెను.౹

21 దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.౹

22 వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి; అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయబడెను.౹

23 మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను.౹

24 దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.

25 మరియు అతడు తుమ్మకఱ్ఱతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి.౹

26 దానికి, అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.౹

27 దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను.౹

28 దాని మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను.౹

29 అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/37-a9f2ad8eceabab9e1a3c344fe37f0baa.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 38

1 మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను.౹

2 దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.౹

3 అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటిని, అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను.౹

4 ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.౹

5 మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.౹

6 ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.౹

7 ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.

8 అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను.

9 మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను.౹

10 వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹

11 ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹

12 పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹

13 తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;౹

14 ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.౹

15 అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.౹

16 ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి.౹

17 స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను.౹

18 ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములుగలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు.౹

19 వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి.౹

20 వాటి బోదెలకు వెండిరేకు పొదిగింప బడెను, వాటి పెండెబద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నియు ఇత్తడివి.

21 మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్కపెట్టించెను.౹

22 యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను.౹

23 దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైనపని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడునై యుండెను.

24 పరిశుద్ధస్థలవిషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింప బడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది తులములు.౹

25 సమాజములో చేరినవారి వెండి పరిశుద్ధస్థలపు తులముచొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు.౹

26 ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందిలో తలకొకటికి అరతులము.౹

27 ఆ నాలుగువందల వెండి మణుగులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను.౹

28 వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను.౹

29 మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు.౹

30 అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటిని

31 చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు మేకులన్నిటిని చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/38-f3aaf2a4200a68c179eaaf3260db5f1a.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 39

1 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోనుచేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి.

2 మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను.౹

3 నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి.౹

4 దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.౹

5 దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

6 మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.౹

7 అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

8 మరియు అతడు ఏఫోదుపనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్న నారతోను చిత్రకారునిపనిగా పతకమును చేసెను.౹

9 అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది.౹

10 వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;౹

11 పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది;౹

12 గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడవది;౹

13 రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతమునుగల పంక్తి నాలుగవది; వాటివాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను.౹

14 ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్ల చొప్పున, పండ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, పండ్రెండు గోత్రముల పేళ్లు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.౹

15 మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి.౹

16 వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి

17 అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి

18 అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజఖండములమీద దాని యెదుట ఉంచిరి.౹

19 మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.౹

20 మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పునొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.౹

21 ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

22 మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను.౹

23 అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.౹

24 మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి.౹

25 మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్లమధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులమీద చుట్టునున్న దానిమ్మపండ్లమధ్యను ఆ గంటలను పెట్టిరి.౹

26 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి.

27-29 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి.

30 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు మేలిమి బంగారుతో పరిశుద్ధకిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలె దానిమీద – యెహోవా పరిశుద్ధుడుఅను వ్రాత వ్రాసిరి.౹

31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.౹

32 ప్రత్యక్షపు గుడారపు మందిరముయొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.

33 అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటిని దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను,౹

34 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను,౹

35 సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును,౹

36 బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,౹

37 పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును

38 బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలాద్వారమునకు తెరను

39 ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను

40 ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవకొరకైన ఉపకరణములన్నిటిని, పరిశుద్ధస్థలములోని

41 యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసికొని వచ్చిరి.౹

42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి.౹

43 మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లువారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/39-d64985c5c9803ef741c2256a833d5b02.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 40

1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను

2 –మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.౹

3 అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.౹

4 నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.౹

5 సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరద్వారమునకు తెరను తగిలింపవలెను.౹

6 ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను;౹

7 ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకునుమధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.౹

8 తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింపవలెను.౹

9 మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.౹

10 దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును.౹

11 ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకముచేసి దాని ప్రతిష్ఠింపవలెను.౹

12 మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి

13 అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను.౹

14 మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి

15 వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.౹

16 మోషే ఆప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.

17 రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.౹

18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి

19 మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.౹

20 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.౹

21 మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.౹

22 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి

23 యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.౹

24 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి

25 యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను.౹

26 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి

27 దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.౹

28 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి

29 దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.౹

30 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.౹

31 దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.౹

32 వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.౹

33 మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.

34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా

35 యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.౹

36 మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.౹

37 ఇదే వారి ప్రయాణపద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.౹

38 ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/40-f001d9262d96586ee8d8a4147569ecd9.mp3?version_id=1787—