Categories
దానియేలు

దానియేలు 11

1 మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.

2 ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.౹

3 అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.౹

4 అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింప బడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.౹

5 అయితే దక్షిణదేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలముపొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును.౹

6 కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణదేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు.౹

7 అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తరదేశపురాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును

8 మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపెట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.౹

9 అతడు దక్షిణ దేశపురాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును.౹

10 అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును.౹

11 అంతలో దక్షిణదేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపురాజుతో యుద్ధము జరిగించును; ఉత్తరదేశపురాజు గొప్పసైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.౹

12 ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణదేశపు రాజు మనస్సున అతిశయ పడును; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు.౹

13 ఏలయనగా ఉత్తర దేశపురాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును.౹

14 ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.౹

15 అంతలో ఉత్తరదేశపురాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజుయొక్క బలము నిలువలేకపోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.౹

16 వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టమువచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును.౹

17 అతడు తన రాజ్యముయొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధిచేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు.౹

18 అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.౹

19 అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పు కొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.౹

20 అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.౹

21 అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరుగాని నెమ్మది కాలమందు అతడువచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.౹

22 ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలనవారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.౹

23 అతడు సంధిచేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనముగలవాడైనను ఎదు రాడి బలము పొందును.౹

24 అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులుగాని చేయనిదానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును

25 అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.౹

26 ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.౹

27 కీడుచేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.౹

28 అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును.౹

29 నిర్ణయకాలమందు మరలి దక్షిణదిక్కునకు వచ్చునుగాని మొదట నున్నట్టుగా కడపటనుండదు.౹

30 అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడిమరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.౹

31 అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు.౹

32 అందుకతడు ఇచ్చకపుమాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.౹

33 జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు.౹

34 వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని

35 నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలమువరకు జనులను పరిశీ లించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.౹

36 ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణ యించినది జరుగును.౹

37 అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.౹

38 అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.౹

39 మరియు ఈ క్రొత్త దేవతను ఆధారముచేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహాఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకులమీద తనవారికి ప్రభుత్వ మిచ్చును.౹

40 అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధముచేయును. మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీదపడి దేశములమీదుగా ప్రవాహమువలె వెళ్లును.౹

41 అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతనిచేతిలోనుండి తప్పించు కొనెదరు.౹

42 అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.౹

43 అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుయొక్క విలువ గల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీ యులను తనకు పాదసేవకులుగా చేయును.౹

44 అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చి యతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనే కులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును.౹

45 కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య వేయును; అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయముచేయు వాడెవడును లేకపోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DAN/11-012c9e2dafe583d56f0b6d5e0f202f0b.mp3?version_id=1787—

Categories
దానియేలు

దానియేలు 12

1 ఆ కాలమందు నీ జనులపక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలమువరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.౹

2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.౹

3 బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.౹

4 దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.

5 దానియేలను నేను చూచుచుండగా మరియిద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి.౹

6 ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి–ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా

7 నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవియగువాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తము లగుననెను.౹

8 నేను వింటినిగాని గ్రహింపలేకపోతిని–నా యేలినవాడా, వీటికి అంతమేమని నేనడుగగా

9 అతడు– ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగాఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుమని చెప్పెను.౹

10 అనేకులు తమ్మును శుద్దిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.౹

11 అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినము లగును.౹

12 వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు.౹

13 నీవు అంత్యమువరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DAN/12-e1e8f2238fb53d51c62b63cd2c446f02.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 1

1 ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

2 మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను–జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారముచేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.౹

3 కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమె రును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా

4 యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను–ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్తదోషమునుబట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును.౹

5 ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.౹

6 పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా–దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.౹

7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.౹

8 లోరూహామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్భవతియై కుమారుని కనినప్పుడు

9 యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా–మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

10 ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు–మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే–మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.౹

11 యూదావారును ఇశ్రాయేలువారును ఏకముగా కూడుకొని, తమపైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/1-ce59a988b353f987941e8c6a8684479e.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 2

1 మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి.౹

2 నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగాచేసి, పాడుపెట్టి యెండిపోయిన భూమివలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు,౹

3 మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను;౹

4 దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను.౹

5 అది – నాకు అన్నపానములను గొఱ్ఱెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది.౹

6 ముండ్లకంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.౹

7 అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది–ఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదుననుకొనును.౹

8 దానికి ధాన్య ద్రాక్షారసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉప యోగపరచెను.౹

9 కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును;౹

10 దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలోనుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.౹

11 దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును.౹

12 –ఇవి నా విటకాండ్రు నాకిచ్చినజీతమని అది తన ద్రాక్ష చెట్లనుగూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును.౹

13 అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసియుండుటనుబట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు.౹

14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;౹

15 అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు

16 అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు–బయలుఅని నన్ను పిలువక–నా పురుషుడవుఅనిపిలుతువు, ఇదే యెహోవా వాక్కు.౹

17 –అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను.౹

18 ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.౹

19 నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును.౹

20 నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును.౹

21 ఆ దినమున నేను మనవి ఆలకింతును; ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవి ఆలకించును;౹

22 భూమి ధాన్య ద్రాక్షారసతైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలుచేయు మనవి ఆలకించును.౹

23 నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో–మీరే నా జనమని నేను చెప్పగా వారు–నీవే మా దేవుడవు అనియందురు; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/2-463522c2d2f2e24af45a6adc52087314.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 3

1 మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవావారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.౹

2 కాగా నేను పదునైదు తులముల వెండియు ఐదు తూములు యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని

3 –చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును.౹

4 నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పిం పకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.౹

5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందువారు భయభక్తులుకలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/3-11b6a71e4eeb7c4bf8e9f0b4faa9cb0a.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 4

1 ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.౹

2 అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు.౹

3 కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్రమత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.౹

4 ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు.౹

5 కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును.౹

6 నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.౹

7 తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును.౹

8 నా జనుల పాపములనుఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.౹

9 కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తననుబట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేతును.౹

10 వారు యెహోవాను లక్ష్యపెట్టుటమానిరి గనుక వారు భోజనముచేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు.౹

11 వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి.౹

12 నా జనులు తాము పెట్టుకొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.౹

13 పర్వతముల శిఖరములమీద బలులనర్పింతురు, కొండలమీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి.౹

14 జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యముచేయుచు బలులనర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటనుబట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూలమగును.౹

15 ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు; బేతావెనునకు పోవద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణముచేయవద్దు.౹

16 పెయ్య మొండి తనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱెపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.౹

17 ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము.౹

18 వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకరమైన దానిని ప్రేమింతురు.౹

19 సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును; తాము అర్పించిన బలులనుబట్టి వారు సిగ్గునొందుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/4-30c5bdb636c976819180b6f3aa28d2d6.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 5

1 యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలువారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును.౹

2 –వారు మితిలేకుండ తిరుగు బాటుచేసిరి గనుక నేను వారినందరిని శిక్షింతును.౹

3 ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.౹

4 తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలనవారు యెహోవాను ఎరుగక యుందురు.౹

5 ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రా యిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లుచున్నారు.౹

6 వారు గొఱ్ఱెలను ఎడ్లను తీసికొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును.౹

7 యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతోకూడ లయమగుదురు.

8 గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి; బెన్యామీనీయులారా–మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి.౹

9 శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును; నిశ్చయముగా జరుగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపువారికి నేను తెలియజేయుచున్నాను.౹

10 యుదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారివలెనున్నారు; నీళ్లు ప్రవ హించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును.౹

11 ఎఫ్రాయిమీయులు మానవపద్ధతినిబట్టి ప్రవర్తింప గోరు వారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు బాధింపబడుదురు.౹

12 ఎఫ్రాయిమీయు లకు చిమ్మట పురుగువలెను యూదావారికి వత్సపురుగువలెను నేనుందును.౹

13 తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగుచేయజాలడు.౹

14 ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహమువంటివాడనుగాను యూదావారికి కొదమసింహమువంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేక పోవును

15 వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/5-05ada43a3662ecaccafaa7d1119b6859.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 6

1 మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

2 రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవదినమున ఆయన మనలను స్థిరపరచును.౹

3 యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

4 ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును.౹

5 కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటిమాటల చేత వారిని వధించియున్నాను.౹

6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.౹

7 ఆదాము నిబంధన మీరినట్లువారు నాయెడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరియున్నారు.౹

8 గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి.౹

9 బందిపోటుదొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై యున్నారు,౹

10 ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలువారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు.౹

11 చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలమునిర్ణయించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/6-a4f5c262e7af53f40549e7fc1cdc0dfe.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 7

1 –నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.౹

2 తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను–మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు.౹

3 వారుచేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.౹

4 రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు.౹

5 మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను.౹

6 పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది.౹

7 పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మ్రింగివేయుదురు, వారి రాజులందరును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.౹

8 ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.౹

9 అన్యులు అతని బలమును మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు.౹

10 ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.౹

11 ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.౹

12 వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.౹

13 వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ధములు చెప్పుదురు

14 హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు.౹

15 నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు.౹

16 వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఈలాగునవారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/7-5cd0fa883e0c4de6d863fad66dbef38a.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 8

1 –బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము.౹

2 వారు–మా దేవా, ఇశ్రాయేలువారలమైన మేము నిన్ను ఎరిగియున్నవారమే యని నాకు మొఱ్ఱపెట్టుదురు;౹

3 ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.౹

4 నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.౹

5 షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నాకోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?

6 అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.౹

7 వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.౹

8 ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు.౹

9 అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలువారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచు కొనెను.౹

10 వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.౹

11 ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను.౹

12 నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.౹

13 నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.౹

14 ఇశ్రాయేలువారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/8-a214d08420aef6ddf0a9346ae4060b9d.mp3?version_id=1787—