Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 29

1 పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ . దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

3 –ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; –నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;౹

4 నేను నీ దవుడ లకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసు లకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.౹

5 నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేలమీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.౹

6 అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;౹

7 వారు నిన్ను చేతపట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.౹

8 కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,౹

9 ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. –నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొనుచున్నాడు గనుక

10 నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దువరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.౹

11 దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.౹

12 నిర్మానుష్యముగానున్న దేశములమధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడైపోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.౹

13 ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.౹

14 చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,౹

15 వారికను జనములమీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు; వారు ఇక రాష్టములమీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను.౹

16 ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారితట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

17 ఇరువదియేడవ సంవత్సరము మొదటినెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

18 –నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను.౹

19 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తుదేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించుచున్నాను, అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపట్టును, అది అతని సైన్యమునకు జీతమగును.౹

20 తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

21 ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/29-2ea6b45b9beaac529bfbc3d696112615.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 30

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే,౹

3 యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.౹

4 ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషుదేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు.౹

5 కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

6 యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు.౹

7 పాడైపోయిన దేశములమధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణము లుండును.౹

8 ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులులేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹

9 ఆ దినమందు దూతలు నా యెదుటనుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.

10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తీయులుచేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.౹

11 జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు.౹

12 నైలునదిని ఎండిపోజేసి నేనాదేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను

13 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.౹

14 పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.౹

15 ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మ రించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను

16 ఐగుప్తుదేశములో నేను అగ్ని యుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.౹

17 ఓనువారిలోను పిబేసెతువారిలోను యౌవనులు ఖడ్గముచేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.౹

18 ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు.౹

19 నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

20 పదకొండవ సంవత్సరము మొదటి నెలయేడవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

21 –నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

22 –నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతనిచేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.౹

23 ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.౹

24 మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతనిచేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బతినినవాడై మూల్గులిడును.౹

25 బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరోచేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.౹

26 నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/30-09d6aec3acd065253930167092a771b3.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 31

1 మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము–ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు?

3 అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.౹

4 నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమై నందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను.౹

5 కాబట్టి అది ఎదిగి పొలము లోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను.౹

6 ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను.౹

7 ఈలాగున అది పొడుగైన కొమ్మలుకలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను.౹

8 దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు.౹

9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.

10 కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్వించెను.౹

11 కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యతనిని తరిమి వేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను; ఆ జనము అతనికి తగినపని చేయును.౹

12 జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి, కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను, భూమియందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.౹

13 పడిపోయిన అతని మోడుమీద ఆకాశపక్షు లన్నియు దిగి వ్రాలును, అతని కొమ్మలమీద భూజంతువు లన్నియు పడును.౹

14 నీరున్నచోటున నున్న వృక్షములన్నిటిలో ఏదియు తన యెత్తునుబట్టి అతిశయపడి, తన కొనను మేఘముల కంటజేసి, యే వృక్షముగాని దాని యెత్తునుబట్టి గర్వింపకుండునట్లు, క్రిందిలోకమునకుపోవు నరుల యొద్దకు దిగువారితోకూడ మరణము పాలైరి.

15 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని, అగాధజలములు అతని కప్పజేసితిని, అనేక జలములను ఆపి అతనినిబట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని, అతనికొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసితిని, ఫలవృక్షములన్నియు అతనిగూర్చి వ్యాకులపడెను, పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవువారియొద్దకు అతని పడ వేయగా

16 అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షములన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి.౹

17 అన్యజనులమధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితోకూడ పాతాళమునకు అతడు హతము చేసినవారి యొద్దకు దిగిరి.

18 కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/31-259df18308d2f8acf71e6a68f22fd982.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 32

1 మరియు పండ్రెండవ సంవత్సరము పండ్రెండవనెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము–జనములలో కొదమ సింహమువంటివాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి.౹

3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు.౹

4 నేను నిన్ను నేల పడవేసి తెరపనేలమీద పారవేసెదను, ఆకాశపక్షులన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూజంతువులన్నిటిని కడుపార తిననిచ్చెదను,౹

5 నీ మాంసమును పర్వతములమీద వేసెదను, లోయలన్నిటిని నీ కళేబరములతో నింపెదను.౹

6 మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతములవరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును.౹

7 నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.౹

8 నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

9 నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపము పుట్టింతును,౹

10 నా ఖడ్గమును నేను వారిమీద ఝుళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.౹

11 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–బబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,౹

12 శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; వారు ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును.౹

13 మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును.౹

14 అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

15 నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలముచేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹

16 ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తునుగూర్చియు అందులోని సమూహమునుగూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

17 పండ్రెండవ సంవత్సరము నెల పదునైదవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

18 –నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమునుగూర్చి అంగలార్చుము, ప్రసిద్ధినొందిన జనముల కుమార్త్తెలు భూమిక్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము.౹

19 సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము.౹

20 ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి.౹

21 వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అనియందురు; పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు.౹

22 అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చియున్నారు.౹

23 దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి.౹

24 అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితోకూడ వారు అవమానము నొందుదురు.౹

25 హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు సజీవులలోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితోకూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును.౹

26 అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవులలోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి.౹

27 అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవులలోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను.౹

28 నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు.౹

29 అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి.౹

30 అక్కడ ఉత్తరదేశపు అధిపతులందరును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవ మానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు.౹

31 కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

32 సజీవులలోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైనవారియొద్ద సున్నతిలేనివారితోకూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/32-b7af5cf777b1e88f608afe192e8f25a8.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 33

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము–నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినయెడల

3 అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున

4 ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది

5 బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడినయెడల తనప్రాణమును రక్షించుకొనును.౹

6 అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించినయెడల వాడు తన దోషమునుబట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణచేయుదును.౹

7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.౹

8 –దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును.౹

9 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.

10 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–మా పాపదోషములు మామీద పడియున్నవి, వాటివలన మేము క్షీణించుచున్నాము, మనమెట్లు బ్రదుకుదుమని మీరు చెప్పుకొనుమాట నిజమే.౹

11 కాగా వారితో ఇట్లనుము–నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతో షము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

12 మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము–నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడు తనమునుబట్టివాడు పడిపోడు, ఆలాగుననే నీతిమంతుడు పాపముచేసిన దినమున తన నీతినిబట్టి అతడు బ్రదుక జాలడు.౹

13 నీతిమంతుడు నిజముగా బ్రదుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారముచేసికొని పాపము చేసినయెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమునుబట్టి యతడు మరణము నొందును.౹

14 మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించుచు

15 కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును.౹

16 అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.౹

17 అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది?

18 నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసినయెడల ఆ పాపమునుబట్టి అతడు మరణము నొందును.౹

19 మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిన్యాయములను అనుసరించినయెడల వాటినిబట్టి అతడు బ్రదుకును.౹

20 యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే; ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధించెదను.

21 మనము చెరలోనికి వచ్చిన పండ్రెండవ సంవత్సరము పదియవ నెల అయిదవదినమున ఒకడు యెరూషలేములోనుండి తప్పించుకొని నాయొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడెనని తెలియజేసెను.౹

22 తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నామీదికి వచ్చెను; ఉదయమున అతడు నాయొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండి నేను మౌనిని కాకయుంటిని.౹

23 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

24 –నరపుత్రుడా, ఇశ్రాయేలుదేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు–అబ్రాహాము ఒంటరియై యీ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా; అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు.౹

25 కాబట్టి వారికీమాట ప్రకటనచేయుము –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహములవైపు దృష్టియుంచు మీరు, నరహత్యచేయు మీరు, ఈ దేశమును స్వతంత్రించుకొందురా?

26 మీరు ఖడ్గము నాధారము చేసికొనువారు, హేయక్రియలు జరిగించు వారు, పొరుగువాని భార్యను చెరుపువారు; మీవంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

27 –నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములోఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.౹

28 ఆ దేశమును నిర్జనముగాను పాడుగానుచేసి దాని బలాతిశయమును మాన్పించెదను, ఎవరును వాటిలో సంచరింపకుండ ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును.౹

29 వారు చేసిన హేయక్రియలన్నిటినిబట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహో వానై యున్నానని వారు తెలిసికొందురు.౹

30 మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్నుగూర్చి మాటలాడుదురు, ఒకరి నొకరు చూచి–పోదము రండి, యెహోవాయొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పు కొనుచున్నారు.౹

31 నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.౹

32 నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచుమంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.౹

33 అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్యనుండెనని వారు తెలిసికొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/33-07094973bfc32aeac9c3ce683715f7af.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 34

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.౹

3 మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు,౹

4 బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.౹

5 కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.౹

6 నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.౹

7 కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి

8 –కాపరులులేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

9 కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.౹

10 –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనజాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

11 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.౹

12 తమ గొఱ్ఱెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి

13 ఆయా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.౹

14 నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,౹

15 నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

16 తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.౹

17 నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా– గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకునుమధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.౹

18 విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?

19 మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?

20 కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱెలకును చిక్కిపోయిన గొఱ్ఱెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.౹

21 మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు.౹

22 నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను.౹

23 వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.౹

24 యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.౹

25 మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములోలేకుండచేయుదును.౹

26 వారిని నా పర్వతము చుట్టుపెట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును,౹

27 ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹

28 ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయములేకుండ వారు సురక్షితముగా నివసించెదరు.౹

29 మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.౹

30 అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

31 నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/34-81c206767eed525fd15b22e1f1be001f.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 35

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని

3 దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను.౹

4 నీవు నిర్జనముగాఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.౹

5 ఇశ్రాయేలీయులయెడల ఎడతెగని పగకలిగి, వారి దోషసమాప్తికాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక

6 నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసెదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

7 వచ్చువారును పోవువారునులేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.౹

8 అతని పర్వతములను హతమైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.౹

9 నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.౹

10 –యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే;౹

11 నా జీవముతోడు నీవు వారి యెడల పెట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.౹

12 –అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములనుగురించి పలికిన దూషణమాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు.౹

13 పెద్దనోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను.౹

14 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను.౹

15 ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆప్రకారము గానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/35-f966a8a9b0eb11f5ee94abaec81f8d4d.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 36

1 మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వత .ములకు ఈ మాట ప్రవచింపుము–ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి,౹

2 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – ఆహా ప్రాచీనములైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.౹

3 వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.౹

4 కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–శేషించిన అన్యజనులకు అపహాస్యా స్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థలములతోను నిర్జనమైన పట్టణములతోను

5 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – సంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరినిబట్టియు, శేషించిన అన్యజనులనుబట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.౹

6 కాబట్టి ఇశ్రాయేలుదేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము– ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరు అన్యజనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను.౹

7 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ చుట్టునున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.౹

8 ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చె దరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు.౹

9 నేను మీ పక్షముననున్నాను, నేను మీతట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు.౹

10 మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును.౹

11 మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి,మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹

12 మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీ రికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.౹

13 ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.౹

14 నీవు మనుష్యులను భక్షిం పవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

15 నిన్నుగూర్చి అన్యజనులుచేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు;ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

16 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

17 –నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.౹

18 కాబట్టి దేశములో వారు చేసిన నర హత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి

19 వారి ప్రవర్తననుబట్టియు వారి క్రియలనుబట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి.౹

20 వారు తాము వెళ్లిన స్థలములలోని జనులయొద్ద చేరగా ఆ జనులు–వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.౹

21 కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని.౹

22 కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.౹

23 అన్యజనులమధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

24 నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆయా దేశములలోనుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను.౹

25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.౹

26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.౹

27 నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.౹

28 నేను మీపితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులైయుందురు నేను మీ దేవుడనై యుందును.౹

29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.౹

30 అన్యజనులలో కరవునుగూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమిపంటను నేను విస్తరింపజేసెదను.౹

31 అప్పుడు మీరు మీ ద్షు ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములనుబట్టియు హేయక్రియలనుబట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.౹

32 మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలిసి కొనుడి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తననుగూర్చి చిన్నబోయి సిగ్గు పడుడి.౹

33 మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింప జేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును.౹

34 మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును.౹

35 పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములుగలవాయెననియు జనులు చెప్పుదురు.౹

36 అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసి కొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును.

37 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులకు నేను ఈలాగుచేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.౹

38 నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/36-c3fd7ebccb61ceff5e54004773c0d2f6.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 37

1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా

2 యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.౹

3 ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.౹

4 అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి.౹

5 ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;౹

6 చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹

7 ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను.౹

8 నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను.౹

9 అప్పుడు ఆయన–నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.౹

10 ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.౹

11 అప్పుడాయన నాతో ఇట్లనెను –నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు – మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిమి అని యనుకొనుచున్నారు

12 కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలుదేశములోనికి తోడుకొని వచ్చెదను.౹

13 నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా

14 నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

15 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

16 –నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారిదనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారిదనియు వ్రాయుము.౹

17 అప్పు డది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును.౹

18 –ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా

19 ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎఫ్రాయిము చేతిలో నున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.౹

20 ఇట్లుండగా వారికీలాగు చెప్పుము

21 –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆయా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి

22 వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతములమీద

23 వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.౹

24 నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరియొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.౹

25 మీపితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.౹

26 నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.౹

27 నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.౹

28 మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యముఉండు టనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/37-7803289f023ee27b8d094e793fabfb3a.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 38

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైనవానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము

3 –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.౹

4 నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను.౹

5 నీతోకూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్తాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసెదను.౹

6 గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును.౹

7 నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను.౹

8 చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించుకొని, ఆయా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆయా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.౹

9 గాలి వాన వచ్చి నట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చె దవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు.౹

10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ కాలమందు నీ మనస్సులో అభి ప్రాయములు పుట్టును,౹

11 నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు – నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవనులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.౹

12 వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆయా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులునుగలిగి, భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగి పోయెదను.౹

13 సెబావారును దదాను వారును తర్షీషు వర్తకులును కొదమ సింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచి–సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చి తివా? బహుగా దోపు దోచుకొని, వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొనిపోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా? అని నిన్నడుగుదురు.

14 కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువుగదా?

15 ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనము లనేకములును గుఱ్ఱములెక్కి బహువిస్తారమైన సైన్యముగా కూడి వచ్చి

16 మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.౹

17 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేట ప్రవచించుచువచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చినదే గదా?

18 ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నాకోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

19 కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణముచేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును.౹

20 సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకుపురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును

21 నా పర్వతములన్నిటిలో అతనిమీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

22 తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితోకూడిన జనములనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.౹

23 నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/38-dd2d9c9ce8c88923e70defdbf3197565.mp3?version_id=1787—