Categories
యిర్మీయా

యిర్మీయా 26

1 యోషీయా కుమారుడును యూదారాజునగు . యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవామందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.౹

3 వారి దుర్మార్గమునుబట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాప పడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదు రేమో.౹

4 నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా

5 –మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.౹

6 మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.౹

7 యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.౹

8 జనులకందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని–నీవు మరణశిక్ష నొందక తప్పదు.౹

9 యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలెనగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.

10 యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులోనుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా

11 యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజలతోను ఈలాగనిరి–మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.౹

12 అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెను–ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.౹

13 కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.౹

14 ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.౹

15 అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసులమీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.౹

16 కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి–ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.౹

17 మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.౹

18 –యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను–సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.౹

19 అట్లు పలికినందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవావారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులుకలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్పకీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.

20 మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.౹

21 రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.౹

22 అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;౹

23 వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసికొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.౹

24 ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనులచేతికి అతనిని అప్పగింప లేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/26-08e0b0796e44b1874137704e70c95368.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 27

1 యూదారాజైన యోషీయా కుమారుడగు . యెహోయాకీముఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు– నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.౹

3 వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.౹

4 మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము–మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా

5 –అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.౹

6 ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులను కూడ అతని వశము చేయుచున్నాను.౹

7 అతని స్వదేశమునకు కాలమువచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.౹

8 ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనముచేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.౹

9 కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి.౹

10 మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.౹

11 అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.

12 నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని – బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైనయెడల మీరు బ్రదుకుదురు

13 బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?

14 కావున– మీరు బబులోనురాజునకు దాసులుకాకుందురని మీతోచెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.౹

15 నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించునట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని

16 –యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.౹

17 వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?

18 వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపో బడకుండునట్లువారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.౹

19 బబులోను రాజైన నెబుకద్రె జరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు

20 అతడు విడిచిపెట్టిన స్తంభములనుగూర్చియు సముద్రమునుగూర్చియు గడమంచెలనుగూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములనుగూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.౹

21 యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు

22 –అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలమువరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/27-9842fcf074f59c3e01ee8b75b792a4c7.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 28

1 యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున . నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను

2 –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నేను బబులోనురాజు కాడిని విరిచియున్నాను.౹

3 రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములోనుండి బబులోనునకు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను.౹

4 బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.౹

5 అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా యాజకులయెదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరియెదుటను ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను

6 –ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారినందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక.౹

7 అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్నమాటను చిత్తగించి వినుము.౹

8 నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.౹

9 అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా

10 ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి

11 ప్రజలందరి యెదుట ఇట్లనెను–యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.

12 ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచినతరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

13 – నీవు పోయి హనన్యాతో ఇట్లనుము – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను.౹

14 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికప్పగించియున్నాను.౹

15 అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను–హనన్యా వినుము; యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు.౹

16 కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–భూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను.౹

17 ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/28-b748889a2b28e4fcede7efb74702aa88.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 29

1 రాజైన యెకోన్యా తల్లియగు రాణియు, రాజ పరివారమును,౹

2-3 యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను, హిల్కీయా కుమారుడైన గెమర్యాచేతను, యెరూషలేములోనుండి చెరపట్టబడిపోయినవారి పెద్దలలో శేషించినవారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేమునుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవే

4 –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా తన ప్రేరేపణచేత బబులోనునకు చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు

5 –ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి,౹

6 పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి.౹

7 నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.౹

8 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీ మధ్యనున్న ప్రవక్తలచేతనైనను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.౹

9 వారు నా నామమునుబట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.౹

10 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.౹

11 నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹

12 మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.౹

13 మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,౹

14 నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపెట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.౹

15 బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే,౹

16 సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజునుగూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు

17 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను వారిమీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను; కుళ్లి కేవలము చెడిపోయి తినశక్యముకాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేనువారిని అప్పగించుచున్నాను;౹

18 యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులచేత వారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి.౹

19 గనుక నేను ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును; నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయకారణముగాను అపహాస్యా స్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

20 నేను యెరూషలేములోనుండి బబులోనునకు చెరగొని పోయినవారలారా, మీరందరు యెహోవా ఆజ్ఞను ఆలకించుడి.

21 నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబునుగూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియానుగూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

22 ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారికాజ్ఞాపింపని అబద్ధపుమాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతముచేయును;౹

23 చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబువలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.

24 నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియజేయుము

25 –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–

26 వెఱ్ఱివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవామందిర విషయములలో పైవిచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములోనున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే.౹

27 అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?

28 అతడు తన్నుతాను మీకు ప్రవక్త నుగా చేసికొనెనుగదా అదియుగాక–దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,౹

29 అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్తయైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను

30 అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

31 చెరలోనున్న వారికందరికి నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షెమయానుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు–నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపుమాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.౹

32 –నెహెలామీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండువాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేనుచేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/29-a73c8d152cebd8ba41a76d228a4b6fc8.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 30

1 యెహోవాయొద్దనుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹

2 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

3 –రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.

4 యెహోవా ఇశ్రాయేలువారినిగూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి.౹

5 యెహోవా యిట్లనెను–సమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.౹

6 మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?

7 అయ్యో, యెంత భయంకరమైన దినము ! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.౹

8 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని

9 వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.౹

10 మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడులేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.౹

11 యెహోవా వాక్కు ఇదే–నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.

12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;౹

13 నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగినమందు నీకు లేదు.౹

14 నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్నుగూర్చి విచారింపరు.౹

15 నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.౹

16 నిన్ను మ్రింగువారందరు మ్రింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను.౹

17 వారు–ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.౹

18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు– యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును.౹

19 వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.౹

20 వారి కుమారులుమునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారినందరిని శిక్షించెదను.౹

21 వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారిమధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.౹

22 అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనై యుందును.

23 ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును.౹

24 తన కార్యము ముగించువరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/30-a6fbc146fccbe06655f309acedca037b.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 31

1 యెహోవా వాక్కు ఇదే–ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలైయుందురు.౹

2 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతినొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.౹

3 చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను– శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.౹

4 ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.౹

5 నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు.౹

6 ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి–సీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.౹

7 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడి–యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.౹

8 ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు

9 వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?

10 జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి–ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.౹

11 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు

12 వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవాచేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమునుబట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.౹

13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.౹

14 క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.

15 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.౹

16 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.౹

17 రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.౹

18 నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.౹

19 –నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.౹

20 ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.

21 ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము.౹

22 నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.

23 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చెరలోనుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు–నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.౹

24 అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును.౹

25 కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.౹

26 అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.౹

27 యెహోవా వాక్కు ఇదే – ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.౹

28 వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టియుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.౹

29 ఆ దినములలో–తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.౹

30 ప్రతివాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.

31 –ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధనచేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.౹

32 అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.౹

33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.౹

34 నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డును–యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.౹

35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.౹

36 –ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.౹

37 యెహోవా సెలవిచ్చునదేమనగా – పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునా దులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.౹

38 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.౹

39 కొలనూలు దాని కెదు రుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.౹

40 శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/31-b2fd94d256d570ee9ce67a4f60bf2c7e.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 32

1 యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ . సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹

2 ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,౹

3 యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును,౹

4 అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;౹

5 మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.

6 అంతట యిర్మీయా ఇట్లనెను–యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

7 –నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి – అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.౹

8 కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి–బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసికొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని

9 నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమునుకొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని.౹

10 నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి

11 క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.౹

12 అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని.౹

13 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా

14 –ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము.౹

15 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును.

16 నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని

17 –యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.౹

18 నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.౹

19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియా ఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నర పుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.౹

20 నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారిమధ్యను ఇతర మనుష్యులమధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు.౹

21 సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి

22 మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారి కిచ్చితివి.౹

23 వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవాజ్ఞాపించినవాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నావు.౹

24 ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?

25 యెహోవా ప్రభువా–ధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది.

26 అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

27 –నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?

28 కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు –ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవుచున్నాను; అతడు దాని పట్టుకొనగా

29 ఈ పట్టణము మీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణమునకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసెదరు.౹

30 ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలనవారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు.౹

31-32 నాకోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదావారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి, నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను.౹

33 నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపకపోయిరి, వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పు కొనిరి.౹

34 మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.౹

35 వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్‍హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారికాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.

36 కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు–అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమునుగూర్చి చెప్పుచున్నారు గదా.౹

37 ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను.౹

38 వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.౹

39 మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏకమార్గమును దయచేయుదును.౹

40 నేను వారికి మేలుచేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.౹

41 వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.౹

42 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఈ ప్రజలమీదికి ఇంత గొప్పకీడు రప్పించిన రీతినే నేను వారినిగూర్చి చెప్పిన మేలంతటిని వారిమీదికి రప్పింపబోవుచున్నాను.౹

43 ఇది పాడై పోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయులచేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును.౹

44 నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములుకొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/32-7c1471ecde983d464902494bf7983a14.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 33

1 మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు

3 –నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.౹

4 ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా

5 కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా

6 –నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.౹

7 చెరలోనుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదటనుండినట్లు వారిని స్థాపించుచున్నాను.౹

8 వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.౹

9 భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికిచేయు సకల ఉపకారములనుగూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమునుబట్టియు సమస్తమైన మేలునుబట్టియు భయపడుచు దిగులు నొందుదురు.౹

10-11 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే, సంతోషస్వరమును ఆనంద శబ్దమును పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును–యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును;మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు

12 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.౹

13 మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

14 యెహోవా వాక్కు ఇదే–ఇశ్రాయేలు వంశస్థులనుగూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచిమాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.౹

15 ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.౹

16 ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.౹

17 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.౹

18 ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు.౹

19 మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

20 –యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగినయెడల

21 నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.౹

22 ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.౹

23 మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

24 తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.౹

25 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు – పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల

26 భూమ్యాకాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/33-be3f8ade2e22fec54348117b19704a73.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 34

1 బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.౹

2 –ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు – నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము–యెహోవా సెలవిచ్చునదేమనగా– నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించుచున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును.౹

3 నీవు అతనిచేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.౹

4 యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము –నిన్నుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నీవు ఖడ్గమువలన మృతిబొందక నెమ్మదిగానే మృతి బొందెదవు.౹

5 నీకంటె ముందుగానుండిన పూర్వరాజులైన నీ పితరులకొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు–అయ్యో నా యేలినవాడా, అని నిన్నుగూర్చి అంగలార్చుచు జనులు నీకొరకును ధూపద్రవ్యము కాల్చుదురు; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

6-7 యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలి యున్నవి, బబులోనురాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాట లన్నిటిని ప్రకటించుచు వచ్చెను.

8-9 యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయు రాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదలచాటింపవలెనని రాజైనసిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవాయొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

10 –ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్న వారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.౹

11 అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచుకొనిరి.౹

12 కావున యెహోవాయొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

13 –ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా– దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీపితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని.౹

14 –నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీపితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి.౹

15 మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొనియొక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి.౹

16 పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి

17 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యములన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.౹

18-19 మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను; అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగములమధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.౹

20 వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతి కిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశపక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.౹

21 యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్లిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.౹

22 యెహోవా వాక్కు ఇదే–నేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించుచున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగానుచేయుదును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/34-cbe642f11da032a2bc4103e86fe7a0a5.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 35

1 యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్దనుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై

2 –నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవియ్యగా

3 నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారుల నందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని.౹

4 యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.౹

5 నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి – ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా

6 వారు–మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబు–మీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము.౹

7 మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను.౹

8 కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు.౹

9 మా తండ్రియైన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమునుబట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు

10 గుడారములలోనే నివసించుచున్నాము.౹

11 అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనులదండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి.

12 అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా

13 –నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము–యెహోవా వాక్కు ఇదే–మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? యిదే యెహోవా వాక్కు.౹

14 ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటివరకు తమపితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు; అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు.౹

15 మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు – ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీపితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి

16 రేకాబు కుమారుడైన యెహోనా దాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని యీ ప్రజలు నా మాట వినకయున్నారు.౹

17 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి గనుక యూదావారిమీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారిమీదికి రప్పించుచున్నాను.౹

18 మరియు యిర్మీయా రేకాబీయులను చూచి యిట్లనెను–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీరు మీ తండ్రియైన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మీకాజ్ఞా పించిన సమస్తమును అనుసరించుచున్నారు.౹

19 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడునుండక మానడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/35-f8010c091ca80e073d6dc4f95639e792.mp3?version_id=1787—