Categories
ఆదికాండము

ఆదికాండము 21

1 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.౹

2 ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.౹

3 అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.౹

4 మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.౹

5 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.౹

6 అప్పుడు శారా

–దేవుడు నాకు నవ్వు కలుగజేసెను.

వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

7 మరియు

శారా పిల్లలకు స్తన్యమిచ్చునని

యెవరు అబ్రాహాముతో చెప్పును

నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.

8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.౹

9 అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి

10 –ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.౹

11 అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.౹

12 అయితే దేవుడు–ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.౹

13 అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.౹

14 కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజముమీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.౹

15 ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి

16 యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.౹

17 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి–హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు;౹

18 నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతపట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.౹

19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.౹

20 దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్ద వాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.౹

21 అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

22 ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి–నీవుచేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక

23 నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.౹

24 అందుకు అబ్రాహాము–ప్రమాణము చేసెదననెను.౹

25-26 అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు–ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; నీవును నాతో చెప్పలేదు; నేను నేడేగాని యీ సంగతి విన లేదని చెప్పగా

27 అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.౹

28 తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక

29 అబీమెలెకు అబ్రాహాముతో–నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు

30 –నేనే యీ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱెపిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.౹

31 అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబాఅనబడెను.౹

32 బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.౹

33 అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.౹

34 అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/21-ebd5163ca6f56249d4411daed5e3e380.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 22

1 ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రా హామా, అనిపిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను.౹

2 అప్పుడాయన–నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.౹

3 తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.౹

4 మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి

5 తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి

6 దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా

7 ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అనిపిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా

8 అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.౹

9 ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.౹

10 అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

11 యెహోవాదూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹

12 అప్పుడు ఆయన–ఆ చిన్నవానిమీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్న దనెను.౹

13 అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.౹

14 అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరేఅను పేరు పెట్టెను. అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును.౹

15 యెహోవాదూత రెండవమారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను

16 –నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున

17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.౹

18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.౹

19 తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.

20 ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుప బడినదేమనగా–మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.౹

21 వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,౹

22 కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.౹

23 ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.౹

24 మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును తహ షును మయకాను కనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/22-e60a946badd68837908062881a0062c8.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 23

1 శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువదియేడు.౹

2 శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెనుగూర్చి యేడ్చుటకును వచ్చెను.౹

3 తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి

4 –మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా

5-6 హేతు కుమారులు–అయ్యా మా మాట వినుము. నీవు మామధ్యను మహారాజవై యున్నావు; మా శ్మశాన భూములలో అతి శ్రేష్ఠమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహామునకు ఉత్తరమిచ్చిరి.౹

7 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి

8 –మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.౹

9 సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీమధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.౹

10 అప్పుడు ఎఫ్రోను హేతు కుమారులమధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా

11 –అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టు మనెను.౹

12 అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి

13 –సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చుకొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను.౹

14-15 అందుకు ఎఫ్రోను–అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును; నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;౹

16 అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.౹

17-18 ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నియు, అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.౹

19 ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.౹

20 ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానముకొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/23-c612e2e890d67b6e39038a77ee6f07dc.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 24

1 అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.౹

2 అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసు నితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము;౹

3 నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక

4 నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.౹

5 ఆ దాసుడు – ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొని పోవలెనా అని అడుగగా

6 అబ్రాహాము–అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.౹

7 నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశమునుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి–నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణముచేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.౹

8 అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవుగాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.౹

9 ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.౹

10 అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్ఠమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్ననాహోరు పట్టణము చేరి

11 సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను

12 –నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాముమీద అనుగ్రహము చూపుము.౹

13 చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు.౹

14 కాబట్టి–నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా –నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.౹

15 అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజముమీద పెట్టుకొనివచ్చెను.౹

16 ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని యెక్కి రాగా

17 ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి –నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.౹

18 అందుకామె–అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.౹

19 మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత–నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి

20 త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించితిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.౹

21 ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను.౹

22 ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి

23 –నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను.౹

24 అందుకామె –నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.౹

25 మరియు ఆమె–మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా

26-27 ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి – అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.౹

28 అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.౹

29 రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.౹

30 అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి–ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా

31 లాబాను–యెహోవావలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.౹

32 ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితోకూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి

33 అతనికి భోజనము పెట్టించెనుగాని అతడు–నేను వచ్చిన పనిచెప్పకమునుపు భోజనము చేయననగా లాబాను –చెప్పుమనెను.౹

34-35 అంతట అతడిట్లనెను–నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.౹

36 నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు;౹

37 మరియు నా యజమానుడు నాతో–నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.౹

38 అయితే నా తండ్రి యింటి కిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.౹

39-40 అప్పుడు నేను నా యజమానునితో –ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు అతడు –ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతోకూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు

41 నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యనియెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను.౹

42 నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి–అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసినయెడల

43 నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను–నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పు నప్పుడు

44 –నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవిచేసికొంటిని.౹

45 నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు–నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా

46 ఆమె త్వరగా తన కడవను దించి –త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను.౹

47 అప్పుడు నేను–నీవు ఎవరికుమార్తెవని యడిగినందుకు ఆమె –మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి

48 నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానునియొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.౹

49 కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెద ననగా

50 లాబానును బెతూయేలును–ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవుననిగాని కాదనిగాని చెప్ప జాలము;౹

51 ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తర మిచ్చిరి.౹

52 అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.౹

53 తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.౹

54 అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమునవారు లేచి నప్పుడు అతడు–నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా

55 ఆమె సహోదరుడును ఆమె తల్లియు–ఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి.౹

56 అప్పుడతడు–యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పి నప్పుడు

57 వారు–ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని

58 రిబ్కాను పిలిచి–ఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు –వెళ్లెదననెను.౹

59 కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు

60 వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా

61 రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.

62 ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.౹

63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,౹

64 రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి

65 –మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యు డెవరని దాసుని నడుగగా అతడు–ఇతడు నా యజమాను డని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.౹

66 అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.౹

67 ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణపొందెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/24-3c617ee3ae01626bccc4e6260f49a227.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 25

1 అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసి కొనెను, ఆమె పేరు కెతూరా.౹

2 ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.౹

3 యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.౹

4 ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరు కెతూరా సంతతివారు.౹

5 అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.౹

6 అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.౹

7 అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.౹

8 అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.౹

9 హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.౹

10 అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతిపెట్టబడిరి.౹

11 అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను.

12 ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే.౹

13 ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము

14 మిష్మా దూమా మశ్శా

15 హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా

16 ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరులచొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.౹

17 ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పదియేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.౹

18 వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.

19 అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.౹

20 ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లిచేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.౹

21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.౹

22 ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందు కని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను–

23 రెండు జనములు నీ గర్భములో కలవు.

రెండు జనపదములు నీ కడుపులోనుండి

ప్రత్యేకముగా వచ్చును.

ఒక జనపదముకంటె ఒక జనపదము

బలిప్ఠమై యుండును.

పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

24 ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.౹

25 మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావుఅను పేరు పెట్టిరి.౹

26 తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబుఅను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.౹

27 ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.౹

28 ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.౹

29 ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండు కొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి

30 –నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోముఅనబడెను.౹

31 అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా

32 ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను

33 యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా

34 యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడుతిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/25-2781ba9abc8118ac21a5fbc127783942.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 26

1 అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.౹

2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై–నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.౹

3 ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;౹

4 ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.౹

5 ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

6-7 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా –రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.౹

8 అక్కడ అతడు చాలాదినము లుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలోనుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.౹

9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి–ఇదిగో ఆమె నీ భార్యయే–ఆమె నా సహో దరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు–ఆమెనుబట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను.౹

10 అందుకు అబీమెలెకు–నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.౹

11 అబీమెలెకు–ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా

12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలముపొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.౹

13 అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.౹

14 అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.౹

15 అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.

16 అబీమెలెకు–నీవు మాకంటె బహుబలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా

17 ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.౹

18 అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను.౹

19 మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.౹

20 అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి–ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకుఅను పేరు పెట్టెను.౹

21 వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నాఅను పేరు పెట్టెను.౹

22 అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు–ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతుఅను పేరు పెట్టెను.౹

23-24 అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.౹

25 అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.౹

26 అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.౹

27 ఇస్సాకు–మీరు నామీద పగపెట్టి మీయొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా

28 వారు–నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు

29 మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.౹

30 అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.౹

31 తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.౹

32 ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి–మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక

33 దానికి షేబఅను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.

34 ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను.౹

35 వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/26-d3cd7264824fc7f03862a79f9fd2a2e5.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 27

1 ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్దకుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు–చిత్తము నాయనా అని అతనితోననెను.౹

2 అప్పుడు ఇస్సాకు– ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.౹

3 కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.౹

4 నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.౹

5 ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.౹

6 అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి–ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో

7 –మృతి బొందకమునుపు నేనుతిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచి గల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని.౹

8 కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.౹

9 నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను.౹

10 నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటినితిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రియొద్దకు తీసికొనిపోవలెననెను.౹

11 అందుకు యాకోబు–నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.౹

12 ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమేగాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.౹

13 అయినను అతని తల్లి–నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా

14 అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపఱచెను.౹

15 మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్దనుండెను గనుక

16 రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతనిచేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి

17 తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా

18 అతడు తన తండ్రియొద్దకు వచ్చి–నా తండ్రీ, అనిపిలువగా అతడు–ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను

19 అందుకు యాకోబు–నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.౹

20 అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు–నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.౹

21 అప్పుడు ఇస్సాకు–నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను.౹

22 యాకోబు తనతండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి–స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏశావు చేతులే అనెను.౹

23 యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి

24 –ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు–నేనే అనెను.౹

25 అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.౹

26 తరువాత అతని తండ్రియైన ఇస్సాకు –నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను.౹

27 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను.

ఇదిగో నా కుమారుని సువాసన

యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది.

28 ఆకాశపుమంచును భూసారమును

విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును

దేవుడు నీ కనుగ్రహించుగాక

జనములు నీకు దాసులగుదురు

29 జనములు నీకు సాగిలపడుదురు

నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము

నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు

నిన్ను శపించువారు శపింపబడుదురు

నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక

30 ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.౹

31 అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చి–నా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.౹

32 అతని తండ్రియైన ఇస్సాకు–నీ వెవర వని అతని నడిగినప్పుడు అతడు–నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా

33 ఇస్సాకు మిక్కు టముగా గడగడ వణకుచు–అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలోతిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.౹

34 ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి–ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.౹

35 అతడు–నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.౹

36 ఏశావు–యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి–నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.౹

37 అందుకు ఇస్సాకు–ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తర మియ్యగా

38 ఏశావు–నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు–

39 నీ నివాసము భూసారము లేకయు

పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును.

40 నీవు నీకత్తిచేత బ్రదుకుదువు

నీ సహోదరునికి దాసుడవగుదువు

నీవు తిరుగులాడుచుండగా

నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను.

41 తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు–నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.౹

42 రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను–ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్నుగూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు.౹

43 కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు

44-45 నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము; అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను.

46 మరియు రిబ్కా ఇస్సాకుతో–హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజన మనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/27-5a79a79afe718b7718169ceb03c13b8c.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 28

1 ఇస్సాకు యాకోబును పిలిపించి–నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.౹

2 నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొను మని యతనికి ఆజ్ఞాపించి

3 –సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు

4 ఆయన నీకు, అనగా నీకును నీతోకూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి

5 యాకోబును పంపివేసెను. అతడు పద్దన రాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.౹

6 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు–నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞా పించెననియు

7 యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొని నప్పుడు,౹

8 ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసి నప్పుడు

9 ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమా ర్తెయు నెబాయోతు సహోదరియునైన మాహలతును కూడ పెండ్లి చేసికొనెను.

10-11 యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.౹

12 అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.౹

13 మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.౹

14 నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.౹

15 ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా

16 యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని

17 భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.౹

18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.౹

19 మరియు అతడు ఆ స్థలమునకు బేతేలనుపేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.౹

20-21 అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల యెహోవా నాకు దేవుడైయుండును.౹

22 మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/28-fc86d2ceca45197ca56e36d0653ec160.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 29

1 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.౹

2 అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొని యుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూత వేసి యుండెను.౹

3 అక్కడికి మందలన్నియు కూడి వచ్చు నప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లుపెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు.౹

4 యాకోబు వారిని చూచి–అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు–మేము హారానువార మనిరి.౹

5 అతడు–నాహోరు కుమారుడగు లాబానును మీ రెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.౹

6 మరియు అతడు–అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు–క్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెలవెంట వచ్చుచున్నదని చెప్పిరి.౹

7 అతడు–ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లుపెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా

8 వారు–మంద లన్నియు పోగుకాకమునుపు అది మావలన కాదు, తరువాత బావిమీదనుండి రాయి పొర్లించుదురు; అప్పుడే మేము గొఱ్ఱెలకు నీళ్లు పెట్టుదుమనిరి.౹

9 అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది.౹

10 యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీదనుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.౹

11-12 మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను.౹

13 లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొనివచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.౹

14 అప్పుడు లాబాను–నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెలదినములు అతనియొద్ద నివసించిన తరువాత

15 లాబాను–నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.౹

16 లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.౹

17 లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.౹

18 యాకోబు రాహేలును ప్రేమించి–నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.౹

19 అందుకు లాబాను–ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్దఉండు మని చెప్పగా

20 యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.౹

21 తరువాత యాకోబు–నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా

22 లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందుచేయించి

23 రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.౹

24 మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.౹

25 ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.౹

26 అందుకు లాబాను–పెద్ద దానికంటె ముందుగా చిన్న దాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.౹

27 ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా

28 యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.౹

29 మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.

30 యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.౹

31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.౹

32 లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.౹

33 ఆమె మరల గర్భవతియై కుమారుని కని–నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసె ననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.౹

34 ఆమె మరల గర్భవతియై కుమారుని కని–తుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను

35 ఆమె మరల గర్భవతియై కుమారుని కని–ఈ సారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/29-f0ad02d7dc4ddbdc1e62e58176f35241.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 30

1 రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో–నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.౹

2 యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు–నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.౹

3 అందు కామె–నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి

4 తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా

5 బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.౹

6 అప్పుడు రాహేలు–దేవుడు నాకు తీర్పు తీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.౹

7 రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.౹

8 అప్పుడు రాహేలు–దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.౹

9 లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.౹

10 లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా

11 లేయా–ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.౹

12 లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా

13 లేయా నేను భాగ్యవంతురాలను–స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.౹

14 గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాతవృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు–నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా

15 ఆమె –నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు–కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.౹

16 సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి–నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.౹

17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.౹

18 లేయా–నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.౹

19 లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.౹

20 అప్పుడు లేయా–దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.౹

21 ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.౹

22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.౹

23 అప్పుడామె గర్భవతియై కుమారుని కని–దేవుడు నా నింద తొలగించెననుకొనెను.౹

24 మరియు ఆమె–యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

25 రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో–నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.౹

26 నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.౹

27 అందుకు లాబాను అతనితో–నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించె నని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.౹

28 మరియు అతడు–నీ జీత మింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.౹

29 అందుకు యాకోబు అతని చూచి–నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;౹

30 నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.౹

31 అప్పుడతడు–నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు–నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.౹

32 నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.౹

33 ఇకమీదట నాకు రావలసిన జీతమునుగూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.౹

34 అందుకు లాబాను –మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.౹

35 ఆ దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరుచేసి తన కుమారులచేతి కప్పగించి

36 తనకును యాకోబునకును మధ్య మూడుదినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను.౹

37 యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి

38 మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా

39 మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.౹

40 యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటితట్టును లాబాను మందలలో నల్లని వాటితట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.౹

41 మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.౹

42 మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను.౹

43 ఆప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/30-4cdb61447e08c808a95728734cb5c49d.mp3?version_id=1787—