Categories
ప్రకటన

ప్రకటన 14

1 మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి.౹

2 మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.౹

3 వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.౹

4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడి కెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.౹

5 వీరినోట ఏ అబద్ధమును కనబడ లేదు; వీరు అనింద్యులు.

6 అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.౹

7 అతడు–మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.

8 వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి–మోహోద్రేకముతోకూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.

9 మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను– ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవ డైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల౹

10 ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధదూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.౹

11 వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడలవాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.౹

12 దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.

13 అంతట–ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవుననిఆత్మచెప్పుచున్నాడు.

14 మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.౹

15 అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి –భూమి పైరుపండి యున్నది,కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.౹

16 మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.

17 ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతనియొద్దను వాడిగల కొడవలియుండెను.౹

18 మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచి–భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.౹

19 కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను౹

20 ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్లెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/14-8c91afa1b61be6313b1b9f916e947e48.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 15

1 మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేతపట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.

2 మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై,ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.౹

3-4 వారు–ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకురాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

5 అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.౹

6 ఏడు తెగుళ్లు చేతపట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతినిధరించుకొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.౹

7 అప్పు డా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.౹

8 అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/15-4ccecf935a87a0ea5061e4d7addbd72a.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 16

1 మరియు–మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.

2 అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారముచేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండుపుట్టెను.

3 రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మ రింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.

4 మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.౹

5 అప్పుడు వర్తమాన భూతకాలములలోఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;౹

6 దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.౹

7 అందుకు–అవునుప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.

8 నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.౹

9 కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లువారు మారుమనస్సు పొందినవారుకారు.

10 అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగముయొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి;౹

11 తమకు కలిగిన వేదనలనుబట్టియు పుండ్లనుబట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు.

12 ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.౹

13 మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.౹

14 అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి,౹

15-16 హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతు రేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

17 ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా–సమాప్తమైనదని చెప్పుచున్న యొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.౹

18 అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.౹

19 ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.౹

20 ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.౹

21 అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/16-3e2f10c94f45352f1b497f875de7a1ce.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 17

1 ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. –నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;౹

2 భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.౹

3 అప్పుడతడుఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని,యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.౹

4 ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేతపట్టుకొనియుండెను.౹

5 దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను–మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.౹

6 మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా౹

7 ఆ దూత నాతో ఇట్లనెను–నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములునుగలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.౹

8 నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.౹

9 ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు;౹

10 మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.౹

11 ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితోపాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.౹

12 నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు.౹

13 వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.౹

14 వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభు వులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.౹

15 మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను – ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడువారిని సూచించును.౹

16 నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.౹

17 దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.౹

18 మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/17-56342d07fe0014f67e20304e15d77084.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 18

1 అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.౹

2 అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను–మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యము నైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.౹

3 ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతోకూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.

4 మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని–నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.౹

5 దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.౹

6 అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.౹

7 అది–నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.౹

8 అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు,అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైనప్రభువుబలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.౹

9-10 దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు–అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.౹

11-14 లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను, ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోధుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులనుమనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు; నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.౹

15-16 ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు–అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు.౹

17 ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి౹

18 –ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి౹

19 తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు–అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పు కొనుచు కేకలు వేయుచుండిరి.౹

20 పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.

21 తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి–ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.౹

22-23 నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనచేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.౹

24 మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/18-2735b794439c295f6cd04e4c2ae3585e.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 19

1 అటుతరువాత బహుజనులశబ్దమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని–ప్రభువును స్తుతించుడి,రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;౹

2 ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతి దండన చేసెను; మరి రెండవసారి వారు–ప్రభువును స్తుతించుడి అనిరి.౹

3 ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.౹

4 అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి–ఆమేన్,ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.౹

5 మరియు–మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.౹

6-7 అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము–సర్వాధికారియుప్రభువునగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.౹

8 మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.౹

9 మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.౹

10 అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు–వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమనినాతో చెప్పెను.

11 మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు౹

12 ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;౹

13 రక్తములో ముంచబడినవస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.౹

14 పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.౹

15 జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.౹

16 –రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది.

17-18 మరియు ఒక దూత సూర్యబింబములోనిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

19 మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.౹

20 అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.౹

21 కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/19-35762c9294c362f89ec35d9f8bb786c6.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 20

1 మరియు పెద్దసంకెళ్లను చేతపట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.౹

2 అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,౹

3 ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.

4 అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.౹

5 ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.౹

6 ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

7 వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.౹

8 భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.౹

9 వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండిఅగ్ని దిగివచ్చి వారిని దహించెను.౹

10 వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రిం బగళ్లు బాధింపబడుదురు.

11 మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.౹

12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.౹

13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.౹

14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.౹

15 ఎవని పేరైననుజీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/20-1985ac99e94ce75afedcecd5e88c2c6a.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 21

1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.౹

2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.౹

3 అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును.౹

4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.౹

5 అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు–ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.౹

6 మరియు ఆయన నాతో ఇట్లనెను–సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.౹

7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడైయుండును.౹

8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

9 అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి–ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,౹

10 ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.౹

11 దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్యరత్నమును పోలియున్నది.౹

12 ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి.౹

13 తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి.౹

14 ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.౹

15 ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.౹

16 ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.౹

17 మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.౹

18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.౹

19 ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,౹

20 అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.౹

21 దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.౹

22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగుప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.౹

23 ఆ పట్టణములో ప్రకా శించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.౹

24 జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.౹

25 అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.౹

26 జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.౹

27 గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/21-d7549c1c1f9d32c02549eb52b5c1aaf4.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 22

1 మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి౹

2 ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుటఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.౹

3 ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.౹

4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.౹

5 రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైనప్రభువేవారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

6 మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను– ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగుప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.౹

7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

8 యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,౹

9 అతడు–వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

10 మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;౹

11 అన్యాయముచేయు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము,అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము,నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.౹

12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.౹

13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.౹

14 జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు.౹

15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

16 సంఘములకోసముఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.

17 ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

18 ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;౹

19 ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.

20 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు–అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము.

21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకుతోడై యుం డును గాక. ఆమేన్.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/22-29962ba5a4c1d7b177793f2b9841f688.mp3?version_id=1787—