Categories
హెబ్రీయులకు

హెబ్రీయులకు 8

1 మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా,౹

2 మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు,అనగా మనుష్యుడుకాకప్రభువేసాప్థిచిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహునిసింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.౹

3 ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.౹

4 ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్నయెడల యాజకుడై యుండడు.౹

5 మోషే గుడారము అమర్చబోయినప్పుడు

–కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున

సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము

అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.౹

6 ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు.౹

7 ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.౹

8 అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు

–ప్రభువుఇట్లనెను–ఇదిగో యొక కాలమువచ్చుచున్నది.

అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను

యూదా ఇంటివారితోను

నేను క్రొత్తనిబంధన చేయుదును.

9 అది నేను ఐగుప్తుదేశములోనుండి

వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై

వారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.

ఏమనగా–వారు నా నిబంధనలో నిలువలేదు

గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని

ప్రభువుచెప్పుచున్నాడు.

10 ఆ దినములైన తరువాత

ఇశ్రాయేలు ఇంటివారితో

నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను

వారి హృదయములమీద వాటిని వ్రాయుదును

నేను వారికి దేవుడునై యుందునువారు నాకు ప్రజలైయుందురు.వారిలో ఎవడును

11 –ప్రభువును తెలిసికొనుడని

తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను

ఉపదేశముచేయడు

వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు

అందరును నన్ను తెలిసికొందురు.

12 నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి

కొననని

ప్రభువుసెలవిచ్చుచున్నాడు.

13 ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకుసిద్ధముగా ఉన్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HEB/8-7dd0d37ecbdf8387b4a7e9a137553111.mp3?version_id=1787—

Categories
హెబ్రీయులకు

హెబ్రీయులకు 9

1 మెుదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.౹

2 ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టె లును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.౹

3 రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.౹

4 అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.౹

5 దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.౹

6 ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని౹

7 సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తము చేతపట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.౹

8 దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయు చున్నాడు.౹

9 ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.౹

10 ఇవి దిద్దు బాటు జరుగుకాలమువచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోనుసంబం ధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.

11 అయితే క్రీస్తు రాబోవుచున్నమేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా,౹

12 మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.౹

13 ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,౹

14 నిత్యుడగుఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీమనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును.౹

15 ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.౹

16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.౹

17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పు డైనను చెల్లునా?౹

18 ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.౹

19-20 ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని–దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.౹

21 అదేవిధముగా గుడారముమీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.౹

22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.

23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేప్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను.౹

24 అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింప లేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.౹

25 అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.౹

26 అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.౹

27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.౹

28 ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HEB/9-6507f3448254745371e754e477dadaba.mp3?version_id=1787—

Categories
హెబ్రీయులకు

హెబ్రీయులకు 10

1 ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగల . దియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆయాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు.౹

2 ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞిప్త ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.౹

3 అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి౹

4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.౹

5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.

–బలియు అర్పణయు నీవు కోరలేదుగాని

నాకొక శరీరమును అమర్చితివి.

6 పూర్ణహోమములును

పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు.

7 అప్పుడు నేను–గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి

వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము

నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

8 –బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత౹

9 ఆయన–నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పు చున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.౹

10 యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.౹

11 మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.౹

12-13 ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీను డాయెను.౹

14 ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.౹

15 ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు.౹

16 ఏలాగనగా

–ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు

నిబంధన ఇదే–నా ధర్మవిధులను వారి హృదయము

నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును

అని చెప్పిన తరువాత

17 –వారి పాపములను వారి అక్రమములను ఇకను

ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను

అనిప్రభువుచెప్పుచున్నాడు.

18 వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

19-20 సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,౹

21 దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,౹

22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములోసంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.౹

23 వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.౹

24-25 కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెననిఆలోచింతము.

26 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని౹

27 న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.౹

28 ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.౹

29 ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగుఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?

30 –పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు

మరియు

–ప్రభువుతన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.౹

31 జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.

32 అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతోకూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.౹

33 ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి.౹

34 ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.౹

35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.౹

36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

37 –ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చు

చున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.౹

38 నా

యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా

జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతని

యందు నా ఆత్మకు సంతోషముండదు.

39 అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకువిశ్వాసము కలిగినవారమై యున్నాము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HEB/10-27230598e795483ca2fd2d7ba5a0863f.mp3?version_id=1787—

Categories
హెబ్రీయులకు

హెబ్రీయులకు 11

1 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.౹

2 దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.౹

3 ప్రపంచములుదేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.౹

4 విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేప్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.౹

5 విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లుకొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.౹

6 విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.౹

7 విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.౹

8 అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.౹

9 విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.౹

10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రా హాము ఎదురుచూచుచుండెను.౹

11 విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.౹

12 అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.౹

14 ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?౹

15 వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లు టకు వారికి వీలు కలిగియుండును.౹

16 అయితే వారు మరి శ్రేప్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.

17-19 అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,

–ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును

అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.౹

20 విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.౹

21 విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందుయోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.౹

22 యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమా రుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములనుగూర్చి వారికి ఆజ్ఞాపించెను.౹

23 మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.౹

24-26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృిష్టి యుంచెను.౹

27 విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.౹

28 తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.౹

29 విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచి పోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగి పోయిరి.౹

30 విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.౹

31 విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.౹

32 ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.౹

33 వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;౹

34 అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.౹

35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేప్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతనపెట్టబడిరి.౹

36 మరికొందరు తిరస్కారము లను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి.౹

37 రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయ బడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,౹

38 గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమ పడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.౹

39-40 వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనములేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేప్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HEB/11-fa59240d1a75d17e0fbb8262bf81f120.mp3?version_id=1787—

Categories
హెబ్రీయులకు

హెబ్రీయులకు 12

1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున౹

2 మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.౹

3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగచేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.౹

4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.౹

5-6 మరియు

–నా కుమారుడా,ప్రభువుచేయు శిక్షను తృణీక

రించకుము

ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

ప్రభువుతాను ప్రేమించువానిని శిక్షించి తాను

స్వీకరించు ప్రతి కుమారుని దండించును

అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.

7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?౹

8 కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.౹

9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులుకలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?౹

10 వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.౹

11 మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.౹

12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.౹

13 మరియు కుంటికాలు బెణకక బాగుపడునిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసికొనుడి.

14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.౹

15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అప విత్రులై పోవుదురేమో అనియు,౹

16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.౹

17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.

18 స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును,౹

19-20 బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి.౹

21 మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే–నేను మిక్కిలి భయపడి వణకు చున్నాననెను.౹

22 ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,౹

23 పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,౹

24 క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.౹

25 మీకు బుద్ధిచెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.౹

26 అప్పు డాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు

–నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశ

మును కూడ కంపింపచేతును

అని మాట యిచ్చియున్నాడు.౹

27 ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగాఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్ధమిచ్చుచున్నది.౹

28-29 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HEB/12-9300b8e4031eb156719ae75a9b52db1a.mp3?version_id=1787—

Categories
హెబ్రీయులకు

హెబ్రీయులకు 13

1 సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.౹

2-3 మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.౹

4 వివాహము అన్ని విషయములలోఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.౹

5 ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి.

–నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.౹

6 కాబట్టి

–ప్రభువునాకు సహాయుడు, నేను భయపడను,

నరమాత్రుడు నాకేమి చేయగలడు?

అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.

7 మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయ కులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమునుశ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.౹

8 యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.౹

9 నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపనుబట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనము లనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.౹

10 మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.౹

11 వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.౹

12 కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.౹

13 కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.౹

14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.౹

15 కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.౹

16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.౹

17 మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

18 మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచుమంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.౹

19 మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను.

20-21 గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలోజరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.

22 సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి యున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.౹

23 మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను.

24 మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.

25 కృప మీ అందరికి తోడై యుండును గాక. ఆమేన్.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HEB/13-7c2a2b4713829fa86fe9eaa99f2415c3.mp3?version_id=1787—

Categories
యాకోబు

యాకోబు 1

1 దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తుయొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

2-3 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.౹

4 మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.౹

6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.౹

7-8 అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.

9 దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.౹

10 ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.౹

11 సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలోవాడిపోవును.

12 శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.౹

13 దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.౹

14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.౹

15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.౹

16 నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.౹

17 శ్రేప్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.౹

18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

19 నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.౹

20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.౹

21 అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.౹

22 మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.౹

23 ఎవ డైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.౹

24 వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా౹

25 అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.౹

26 ఎవ డైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.౹

27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా–దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JAS/1-b09feb59599bcb7c4b6bf6783828364a.mp3?version_id=1787—

Categories
యాకోబు

యాకోబు 2

1 నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.౹

2 ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల౹

3 మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి–నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో–నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల౹

4 మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?౹

5 నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?౹

6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్నవారు వీరే గదా?౹

7 మీకు పెట్టబడిన శ్రేప్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?౹

8 మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.౹

9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.౹

10 ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల,ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;౹

11 వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి.౹

12 స్వాతంత్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి.౹

13 కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.

14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?౹

15 సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹

16 మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹

17 ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.౹

18 అయితే ఒకడు –నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.౹

19 దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.౹

20 వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?౹

21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?౹

22 విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?౹

23 కాబట్టి

–అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను

అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితు డని అతనికి పేరుకలిగెను.౹

24 మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.౹

25 అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?౹

26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JAS/2-cee2960dcf0a897b10ae9c623b480601.mp3?version_id=1787—

Categories
యాకోబు

యాకోబు 3

1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.౹

2 అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము.ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొనశక్తిగలవాడగును.౹

3 గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా౹

4 ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.౹

5 ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును.ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!౹

6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.౹

7 మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని౹

8 యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.౹

9 దీనితో తండ్రియైనప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.౹

10 ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.౹

11 నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?౹

12 నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

13 మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.౹

14 అయితే మీ హృదయములలో సహింపనలవికానిమత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.౹

15 ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.౹

16 ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.౹

17 అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.౹

18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JAS/3-a680c7b52925207640c5cf7ef1e36e10.mp3?version_id=1787—

Categories
యాకోబు

యాకోబు 4

1 మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?౹

2 మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.౹

3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకైదురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.౹

4 వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.౹

5 –ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?౹

6 కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత–దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.౹

7 కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదినిఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.౹

8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.౹

9 వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.౹

10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.౹

12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు.ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

13 –నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,౹

14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.౹

15 కనుక–ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.౹

16 ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.౹

17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JAS/4-9635efd24645d819248281425d862889.mp3?version_id=1787—