Categories
రోమా

రోమా 15

1 కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.౹

2 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.౹

3 క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని–

నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను.

అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.౹

4 ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.౹

5-6 మీరేకభావము గలవారై యేకగ్రీవముగామన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.౹

7 కాబట్టి క్రీస్తు మిమ్మునుచేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.౹

8-9 నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థిచుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై–

ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును;

నీ నామసంకీర్తనము చేయుదును

అని వ్రాయబడియున్నది.

10 మరియు

అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు

11 మరియు

సమస్త అన్యజనులారా,ప్రభువును స్తుతించుడి

సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక

అనియు చెప్పియున్నది.

12 మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు–

యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల

నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు

అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.

13 కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

14 నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మునుగూర్చి రూఢిగా నమ్ముచున్నాను.౹

15-16 అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.౹

17 కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు.౹

18-19 ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపెట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.౹

20-21 నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము

ఆయననుగూర్చిన సమాచారమెవరికి

తెలియజేయబడ లేదో వారు చూతురనియు,

విననివారు గ్రహింతు రనియు,

వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైయుండి ఆలాగున ప్రకటించితిని.

22 ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.౹

23-24 ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.౹

25 అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.౹

26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి.౹

27 అవును వారిష్ట పడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు.౹

28 ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి,నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.౹

29 నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాదసంపూర్ణముతో వత్తునని యెరుగుదును.

30-32 సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికిచేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తునుబట్టియు,ఆత్మవలని ప్రేమనుబట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.౹

33 సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ROM/15-ffd55a10d091722122de0069fbd43f0e.mp3?version_id=1787—

Categories
రోమా

రోమా 16

1 కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని,౹

2 ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.

3 క్రీస్తుయేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.౹

4 వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.౹

5 ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.౹

6 మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.౹

7 నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.౹

8 ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.౹

9 క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.౹

10 క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.౹

11 నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు.౹

12 ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను.౹

13 ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి.౹

14 అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మేకును, పత్రొబకును, హెర్మాకును వారితోకూడనున్న సహోదరులకును వందనములు.౹

15 పిలొలొగుకును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్ధులకందరికిని వందనములు.౹

16 పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

17 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.౹

18 అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.౹

19 మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.౹

20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును.

మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

21 నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.౹

22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.౹

23 నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

24 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

25-27 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ROM/16-32aa58a5a25cd1eb252c507795227400.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 1

1 దేవుని చిత్తమువలన యేసుక్రీస్తుయొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును౹

2 కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.౹

3 మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.

4 క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹

5-6 క్రీస్తునుగూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;౹

7 గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.౹

8 మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.౹

9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.౹

11 నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను.౹

12 మీలో ఒకడు–నేను పౌలు వాడను, ఒకడు–నేను అపొల్లోవాడను, మరియొకడు– నేను కేఫావాడను, ఇంకొకడు–నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

13 క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?౹

14-15 నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹

16 స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.౹

17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యములేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.౹

18 సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.౹

19 ఇందు విషయమై

జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును

అని వ్రాయబడియున్నది.

20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపుతర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?౹

21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్ప మాయెను.౹

22 యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.౹

23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.౹

24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.౹

25 దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతినిజ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని౹

27-29 ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.౹

30 అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు.

31 –అతిశయించువాడుప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/1-e9247251489070888135058a95c15035.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 2

1 సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.౹

2 నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.౹

3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.౹

4-5 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.౹

6 పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోకజ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని౹

7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.౹

8 అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.౹

9 ఇందునుగూర్చి

దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర

చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,

మనుష్య హృదయమునకు గోచరముకాలేదు

అని వ్రాయబడియున్నది.౹

10 మనకైతే దేవుడు వాటిని తనఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆఆత్మఅన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹

11 ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవునిఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.౹

12 దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.౹

13 మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాకఆత్మసంబంధమైన సంగతులనుఆత్మసంబంధమైన సంగతులతో సరిచూచుచు,ఆత్మనేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.౹

14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునిఆత్మవిషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.౹

15 ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.౹

16 ప్రభువుమనస్సును ఎరిగి ఆయనకు బోధింప గలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/2-591e7cfab3022fb6c8e07c95046dd96a.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 3

1 సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.౹

2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీ రింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా?౹

3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?౹

4 ఒకడు–నేను పౌలు వాడను, మరియొకడు–నేను అపొల్లోవాడను, అని చెప్పు నప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?౹

5 అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి౹

6 నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే౹

7 కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.౹

8 నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.౹

9 మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.

10 దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.౹

11 వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹

12-13 ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్య కాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.౹

14 పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.౹

15 ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

16 మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవునిఆత్మమీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?౹

17 ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.

18 ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.౹

19 ఈ లోక జ్ఞానము దేవునిదృష్టికి వెఱ్ఱితనమే.

20 –జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;

మరియు

–జ్ఞానుల యోచనలు వ్యర్థములనిప్రభువునకు తెలియును

అని వ్రాయబడియున్నది.౹

21 కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.౹

22 పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.౹

23 మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/3-9809138cfe6f44dea973f0847d7a2aae.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 4

1 ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతిమను ష్యుడు మమ్మును భావింపవలెను.౹

2 మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడైయుండుట అవశ్యము.౹

3 మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైననునేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.౹

4 నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతు డనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.౹

5 కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

6 సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.౹

7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?౹

8 ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తు లైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?౹

9 మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూత లకును మనుష్యులకును వేడుకగా నున్నాము.౹

10 మేము క్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధి మంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.౹

11 ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;౹

12 స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;౹

13 దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.

14 మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.౹

15-16 క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹

17 ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.౹

18 నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.౹

19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.౹

20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.౹

21 మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/4-2ffedd43b19ddc171fea322fcc4c519f.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 5

1 మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.౹

2 ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసినవారు కారు.౹

3 నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.౹

4-5 ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకైమన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతోకూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.౹

6 మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?౹

7 మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను౹

8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కా పట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.

9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.౹

10 అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?౹

11 ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.౹

12 వెలుపలివారికి తీర్పు తీర్చుట నా కేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని౹

13 మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/5-b12b67fcb7b71bf3bdaccbf76cd08197.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 6

1 మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?౹

2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?౹

3 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరు గరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?౹

4 కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?౹

5 మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరులమధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?౹

6 అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడు చున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు.౹

7 ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?౹

8 అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు.౹

9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర రని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను౹

10 దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.౹

11 మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవునిఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి.

12 అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను.౹

13 భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.౹

14 దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.౹

15 మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.౹

16 వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?

–వారిద్దరు ఏకశరీరమై యుందురు

అని మోషే చెప్పుచున్నాడు గదా?౹

17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.౹

18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.౹

19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹

20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/6-438163f3245987cd90fde18926b97df9.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 7

1 మీరు వ్రాసినవాటివిషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.౹

2 అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.౹

3 భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.౹

4 భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు.౹

5 ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.౹

6-7 ఇది నా హితోపదేశమేగానిఆజ్ఞ కాదు; మనుష్యులందరు నా వలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధము నను మరి యొకడు మరియొక విధమునను ప్రతిమనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

8 నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.౹

9 అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.౹

10 మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.౹

11 ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.౹

12 ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా–ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.౹

13 మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు.౹

14 అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టిపరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.౹

15 అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలనుపిలిచియున్నాడు.౹

16 ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?౹

17 అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.౹

18 సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.౹

19 దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.౹

20 ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.౹

21 దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.౹

22 ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్యము పొందినవాడు. ఆ ప్రకా రమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.౹

23 మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.౹

24 సహోదరులారా, ప్రతిమనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

25 కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను.౹

26 ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.౹

27 భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.౹

28 అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసికొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీరసంబంధమైనశ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.౹

29 సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును౹

30 ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును౹

31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.౹

32 మీరు చింతలేనివారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు.౹

33 పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.౹

34 అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.౹

35 మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.౹

36 అయితే ఒకని కుమార్తెకుఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును౹

37 ఎవడైనను తన కుమార్తెకుపెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.౹

38 కాబట్టి తన కుమార్తెకుపెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.౹

39 భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.౹

40 అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/7-0d9e82c2004be140b1ea3201681f065d.mp3?version_id=1787—

Categories
1 కొరింథీయులకు

1 కొరింథీయులకు 8

1 విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: –మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.౹

2 ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.౹

3 ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.౹

4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము: – లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.౹

5 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.౹

6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹

7 అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.౹

8 భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.౹

9 అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.౹

10 ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?౹

11 అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీను డైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.౹

12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను,మీరు క్రీస్తునకు విరోధముగా పాపముచేయు వారగుచున్నారు.౹

13 కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CO/8-ed1fe13cbd7fc970dff8ab3f1aeee136.mp3?version_id=1787—