Categories
యోహాను

యోహాను 4

1 యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు౹

2 ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.౹

3 అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి.౹

4 ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక౹

5 యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.౹

6 అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.౹

7 సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.౹

8 ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.౹

9 ఆ సమరయ స్ర్తీ–యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.౹

10 అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹

11 అప్పుడా స్ర్తీ–అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?౹

12 తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.౹

13 అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;౹

14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.౹

15 ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదు కొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా౹

16 యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.౹

17 ఆ స్ర్తీ–నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో– నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;౹

18 నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.౹

19 అప్పుడా స్ర్తీ–అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.౹

20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹

21 –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹

22 మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹

23 అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;౹

24 దేవుడుఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹

25 ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా౹

26 యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను.

27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్ర్తీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు.౹

28 ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి౹

29 –మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా౹

30 వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.౹

31 ఆ లోగా శిష్యులు–బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.౹

32 అందుకాయన–భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా౹

33 శిష్యులు–ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.౹

34 యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.౹

35 ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలమువచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను.౹

36 విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.౹

37 విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.౹

38 మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.

39 –నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్ర్తీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమర యులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.౹

40 ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.౹

41 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి–ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక౹

42 మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.

43 ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.౹

44 ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్య మిచ్చెను.౹

45 గలిలయులు కూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.

46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను.౹

47 యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.౹

48 యేసు–సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.౹

49 అందుకా ప్రధాని–ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను.౹

50 యేసు–నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను.౹

51 అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి.౹

52 ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారు–నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి.౹

53 –నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.౹

54 ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/4-2443aa8acdd5c4c3f16e0ee4a4c0a160.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 5

1 అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను.

2 యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.౹

3-4 ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి.౹

5 అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.౹

6 యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా౹

7 ఆ రోగి–అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.౹

8 యేసు–నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా౹

9 వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.

10 ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు–ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.౹

11 అందుకు వాడు– నన్ను స్వస్థపరచినవాడు–నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.౹

12 వారు–నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.౹

13 ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.౹

14 అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి– ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా౹

15 వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.౹

16 ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.౹

17 అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.౹

18 ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.

19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹

20 తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.౹

21 తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.౹

22 తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని౹

23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.౹

24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

26 తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడైయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.౹

27 మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.౹

28 దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని౹

29 మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

30 నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.౹

31 నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు.౹

32 నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును.౹

33 మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను.౹

34 నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను.౹

35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్ట పడితిరి.౹

36 అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹

37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.౹

38 ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు.౹

39 లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు,అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹

40 అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.౹

41 నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.౹

42 నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.౹

43 నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు,౹

44 అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;౹

45 మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును.౹

46 అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.౹

47 మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/5-e57b88354da6ee0bdffb25f55d40f051.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 6

1 అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.౹

2 రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి.౹

3 యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతోకూడ కూర్చుండెను.౹

4 అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.౹

5 కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని౹

6 యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.౹

7 అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారములరొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.౹

8 ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ౹

9 –ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా౹

10 యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.౹

11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;౹

12 వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.౹

13 కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.౹

14 ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.

15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.౹

17 అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.౹

18 అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.౹

19 వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;౹

20 అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.౹

21 కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

22 మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతోకూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.౹

23 అయితేప్రభువుకృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.౹

24 కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.౹

25 సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని–బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా౹

26 యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

27 క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.౹

28 వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా౹

29 యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.౹

30 వారు–అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?౹

31 భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.౹

32 కాబట్టి యేసు–పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు.౹

33 పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.౹

34 కావునవారు–ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి.౹

35 అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.౹

36 మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.౹

37 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.౹

38 నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.౹

39 ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.౹

40 కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

41 కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహార మని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు–ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?౹

42 ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? –నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.౹

43 అందుకు యేసు–మీలో మీరు సణుగుకొనకుడి;౹

44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.౹

45 –వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.౹

46 దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు.౹

47-49 విశ్వసించువాడే నిత్యజీవముగలవాడు. జీవాహారము నేనే. మీపితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.౹

50 దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.౹

51 పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

52 యూదులు–ఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.౹

53 కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.౹

54 నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.౹

55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.౹

56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.౹

57 జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.౹

58 ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను౹

59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని–యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.౹

61 యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను–దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?౹

62 ఆలాగైతే మనుష్యకుమారుడుమునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?౹

63 ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని౹

64 మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను ప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.౹

65 మరియు ఆయన –తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.

66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.౹

67 కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా౹

68 సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹

69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.౹

70 అందుకు యేసు–నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను.౹

71 సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/6-519533451879c85763ff982d6c6af937.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 7

1 అటుతరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.౹

2 యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక౹

3 ఆయన సహోదరులు ఆయనను చూచి–నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యు లును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.౹

4 బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి.౹

5 ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.౹

6 యేసు–నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.౹

7 లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.౹

8 మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకనుపరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.౹

9 ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.

10 అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.౹

11 పండుగలో యూదులు–ఆయన ఎక్కడ నని ఆయనను వెదకుచుండిరి.౹

12 మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొంద రాయన మంచివాడనిరి; మరికొందరు–కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;౹

13 అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.

14 సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.౹

15 యూదులు అందుకు ఆశ్చర్యపడి–చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.౹

16 అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹

17 ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.౹

18 తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు.౹

19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.౹

20 అందుకు జనసమూహము–నీవు దయ్యము పెట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా౹

21 యేసు వారిని చూచి–నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు.౹

22 మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు.౹

23 మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి?౹

24 వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.

25 యెరూషలేమువారిలో కొందరు–వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?౹

26 ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?౹

27 అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చు నప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.౹

28 కాగా యేసు దేవాలయములో బోధించుచు–మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.౹

29 నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.౹

30 అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.౹

31 మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి–క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.౹

32 జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.౹

33 యేసు–ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;౹

34 మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.౹

35 అందుకు యూదులు– మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా?౹

36 –నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.

37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.౹

38 నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.౹

39 తనయందు విశ్వాసముంచువారు పొందబోవుఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుకఆత్మఇంకను అనుగ్రహింపబడియుండలేదు.౹

40 జనసమూహములో కొందరు ఈ మాటలు విని–నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;౹

41 మరికొందరు–ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు–ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా?౹

42 క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.౹

43 కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను.౹

44 వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.

45 ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు–ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా౹

46 ఆ బంట్రౌతులు–ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి.౹

47 అందుకు పరిసయ్యులు–మీరు కూడ మోస పోతిరా?౹

48 అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?౹

49 అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.౹

50 అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.౹

51 అతడు–ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా౹

52 వారు–నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.౹

53 అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/7-36a3a7de4b3fa870fbf44e5ac10e29cc.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 8

1 యేసు ఒలీవలకొండకు వెళ్లెను.౹

2 తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.౹

3 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి౹

4 –బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;౹

5 అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.౹

6 ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.౹

7 వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి–మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి౹

8 మరల వంగి నేలమీద వ్రాయుచుండెను.౹

9 వారామాట విని,పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను.౹

10 యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు?ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు౹

11 ఆమె –లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.

12 మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹

13 కాబట్టి పరిసయ్యులు–నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా౹

14 యేసు– నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.౹

15 మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.౹

16 నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.౹

17 మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.౹

18 నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.౹

19 వారు–నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు–మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.౹

20 ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.

21 మరియొకప్పుడు ఆయన–నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.౹

22 అందుకు యూదులు–నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.౹

23 అప్పుడాయన–మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.౹

24 కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.౹

25 కాబట్టి వారు–నీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితో–మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే.౹

26 మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.౹

27 తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహిం పక పోయిరి.౹

28 కావున యేసు–మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.౹

29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.౹

30 ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి.

31 కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;౹

32 అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా౹

33 వారు–మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.౹

34 అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

35 దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.౹

36 కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతం త్రులైయుందురు.౹

37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.౹

38 నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను.౹

39 అందుకు వారు ఆయనతో–మా తండ్రి అబ్రాహామనిరి; యేసు–మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.౹

40 దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు.౹

41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు– మేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా౹

42 యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.౹

43 మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?౹

44 మీరు మీ తండ్రియగు అపవాదిసంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు.౹

45 నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.౹

46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?౹

47 దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.౹

48 అందుకు యూదులు–నీవు సమరయుడవును దయ్యముపెట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా౹

49 యేసు–నేను దయ్యముపెట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.౹

50 నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు.౹

51 ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడనిమీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.౹

52 అందుకు యూదులు–నీవు దయ్యము పెట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను –ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.౹

53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడ వని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.౹

54 అందుకు యేసు–నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; –మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పు దురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.౹

55 మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.౹

56 మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.౹

57 అందుకు యూదులు– నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,౹

58 యేసు–అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.౹

59 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/8-6a8cb4efab7549c4a5f0025c2d2f8f33.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 9

1 ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.౹

2 ఆయన శిష్యులు – బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా౹

3 యేసు–వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.౹

4 పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనముచేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.౹

5 నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.౹

6 ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి౹

7 –నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.౹

8 కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును–వీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి.౹

9 వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే–నేనే యనెను.౹

10 వారు–నీ కన్నులేలాగు తెరవబడెనని వానినడుగగా౹

11 వాడు–యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి–నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.౹

12 వారు, ఆయన ఎక్కడనని అడుగగావాడు, నేనెరుగననెను.

13 అంతకుముందు గ్రుడ్డియైయుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.౹

14 యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము౹

15 వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు–నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను.౹

16 కాగా పరిసయ్యులలో కొందరు–ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు–పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.౹

17 కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు–ఆయన ఒక ప్రవక్త అనెను.౹

18 వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,౹

19 –గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి.౹

20 అందుకు వాని తలిదండ్రులు–వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.౹

21 ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.౹

22 వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.౹

23 కావున వాని తలిదండ్రులు–వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.౹

24 కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి –దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా౹

25 వాడు–ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను.౹

26 అందుకు వారు–ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా౹

27 వాడు–ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.౹

28 అందుకు వారు–నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;౹

29 దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.౹

30 అందుకు ఆ మనుష్యుడు –ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.౹

31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.౹

32 పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.౹

33 ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.౹

34 అందుకు వారు–నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.

35 పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని–నీవు దేవుని కుమారునియందువిశ్వాసముంచుచున్నావా అని అడిగెను.౹

36 అందుకు వాడు–ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా౹

37 యేసు – నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.౹

38 అంతట వాడు–ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.౹

39 అప్పుడు యేసు–చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.౹

40 ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని–మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.౹

41 అందుకు యేసు – మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని–చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/9-cad5a5d7716db1a456728de1633c4d7d.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 10

1 గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.౹

2 ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి.౹

3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును.౹

4 మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.౹

5 అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.౹

6 ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

7 కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను౹

8 –గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.౹

9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹

10 దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

11 నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.౹

12 జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును.౹

13 జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.౹

14 నేను గొఱ్ఱెల మంచి కాపరిని.౹

15 తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.౹

16 ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.౹

17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.౹

18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

19 ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.౹

20 వారిలో అనేకులు–వాడు దయ్యము పెట్టినవాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.౹

21 మరికొందరు–ఇవి దయ్యము పెట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.

22 ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.౹

23 అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా౹

24 యూదులు ఆయనచుట్టు పోగై–ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.౹

25 అందుకు యేసు–మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹

26 అయితే మీరు నా గొఱ్ఱెలలోచేరినవారుకారు గనుక మీరు నమ్మరు.౹

27 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹

28 నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.౹

29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;౹

30 నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹

31 యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేతపట్టుకొనగా౹

32 యేసు– తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.౹

33 అందుకు యూదులు–నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.౹

34 అందుకు యేసు–మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?౹

35 లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల–నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,౹

36 తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో – నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?౹

37 నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,౹

38 చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.౹

39 వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.

40 యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.౹

41 అనేకులు ఆయనయొద్దకు వచ్చి–యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.౹

42 అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/10-d901ea8350dea0035851ad765db94587.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 11

1 మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి . గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను.౹

2 ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.౹

3 అతని అక్కచెల్లెండ్రు – ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.౹

4 యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.౹

5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.౹

6 అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.౹

7 అటుపిమ్మట ఆయన–మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా౹

8 ఆయన శిష్యులు–బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.౹

9 అందుకు యేసు–పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.౹

10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.౹

11 ఆయన యీ మాటలు చెప్పిన తరువాత–మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా౹

12 శిష్యులు– ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.౹

13 యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.౹

14-15 కావున యేసు–లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.౹

16 అందుకు దిదుమ అనబడిన తోమా–ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

17 యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.౹

18 బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము౹

19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.౹

20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.౹

21 మార్త యేసుతో–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.౹

22 ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.౹

23 యేసు–నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా౹

24 మార్త ఆయనతో–అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.౹

25 అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;౹

26 బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.౹

27 ఆమె–అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడ వైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.౹

28 ఆమె ఈ మాట చెప్పి వెళ్లి–బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.౹

29 ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.౹

30 యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను౹

31 గనుక యింటిలో మరియతోకూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.౹

32 అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.౹

33 ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా,౹

34 వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.౹

35 యేసు కన్నీళ్లు విడిచెను.౹

36 కాబట్టి యూదులు–అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.౹

37 వారిలో కొందరు–ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.౹

38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.౹

39 యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.౹

40 అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;౹

41 అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹

42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.౹

43 ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా౹

44 చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

45 కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని౹

46 వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములనుగూర్చి వారితో చెప్పిరి.

47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి–మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.౹

48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.౹

49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి –మీ కేమియు తెలియదు.౹

50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.౹

51 తనంతట తానే యీలాగు చెప్ప లేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక౹

52 యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.౹

53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.

54 కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.౹

55 మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.౹

56 వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి–మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.౹

57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/11-30aa059bb3b2eef1b007ec30466a12bf.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 12

1 కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.౹

2 మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.౹

3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.౹

4 ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా౹

5 –యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకుఅమ్మి బీదలకు ఇయ్యలేదనెను.౹

6 వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.౹

7 కాబట్టి యేసు–నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;౹

8 బీదలు ఎల్లప్పుడును మీతోకూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.

9 కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరును కూడ చూడవచ్చిరి.౹

10-11 అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరును కూడ చంప నాలోచనచేసిరి.

12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹

13 ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము,ప్రభువుపేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.

14-15 –సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు

గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు

అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.౹

16 ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.౹

17 ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.౹

18 అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి.౹

19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు– మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంటపోయినదని చెప్పుకొనిరి.

20 ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.౹

21 వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి–అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా౹

22 ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.౹

23 అందుకు యేసు వారితో ఇట్లనెను–మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.౹

24 గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును.౹

25 తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

26 ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.౹

27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?–తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;౹

28 తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట–నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.౹

29 కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము–ఉరిమెను అనిరి. మరికొందరు–దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.౹

30 అందుకు యేసు– ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.౹

31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;౹

32 నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.౹

33 తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.౹

34 జనసమూహము–క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.౹

35 అందుకు యేసు–ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండ గనే నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.౹

36 మీరు వెలుగు సంబంధు లగునట్లుమీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.

38 –ప్రభువా,మా వర్తమానము నమ్మినవాడెవడు?

ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచ

బడెను?

అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.౹

39-40 ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా–వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి

మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు

నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసివారి హృదయము కఠినపరచెను

అని యెషయా మరియొక చోట చెప్పెను.౹

41 యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.౹

42 అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములోనుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.౹

43 వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

44 అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను–నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.౹

45 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.౹

46 నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.౹

47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.౹

48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.౹

49 ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.౹

50 మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/12-377cd33da5deb6d6e97a12b1c4211e9a.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 13

1 తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన . గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకుప్రేమించెను.౹

2 వారు భోజనముచేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాదిఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక౹

3 తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి౹

4 భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసి కొని నడుమునకు కట్టుకొనెను.౹

5 అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.౹

6 ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చి నప్పుడు అతడు–ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.౹

7 అందుకు యేసు–నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా౹

8 పేతురు–నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.౹

9 సీమోను పేతురు–ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడ కడుగుమని ఆయనతో చెప్పెను.౹

10 యేసు అతని చూచి–స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.౹

11 తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక– మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.

12 వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి–నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?౹

13 బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.౹

14 కాబట్టిప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.౹

15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.౹

16 దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడుతన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.౹

18 మిమ్మునందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని

–నాతోకూడ భోజనముచేయువాడు నాకు విరోధ

ముగా తన మడమ యెత్తెను

అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.౹

19 జరిగి నప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగకమునుపు మీతో చెప్పుచున్నాను.౹

20 నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

21 యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడి–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను౹

22 ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా౹

23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను౹

24 గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.౹

25 అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు–ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.౹

26 అందుకు యేసు–నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;౹

27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు–నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా౹

28 ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.౹

29 డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటినికొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.౹

30 వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.

31 వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను–ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.౹

32 దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.౹

33 పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్క డికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పు చున్నాను.౹

34 మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.౹

35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

36 సీమోను పేతురు–ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు–నేను వెళ్లు చున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను.౹

37 అందుకు పేతురు –ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా౹

38 యేసు–నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/13-6501513e3835e0decec9a8cb818f2f32.mp3?version_id=1787—