Categories
2 రాజులు

2 రాజులు 1

1 అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.౹

2 అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై–మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి–ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా

3 యెహోవాదూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను–నీవులేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము–ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?

4 కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవెక్కిన మంచము మీదనుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను.౹

5 తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. –మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా

6 వారు–ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి–మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి– యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా

7 –మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.౹

8 అందుకు వారు–అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా–ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.౹

9 వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితోకూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్చుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి–దైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.౹

10 అందుకు ఏలీయా– నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండిదిగి వానిని వాని యేబదిమందిని దహించెను.౹

11 మరల రాజు ఏబదిమందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి–దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.౹

12 అందుకు ఏలీయా–నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.౹

13 ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితోకూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని–దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.౹

14 చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వానివాని యేబదిమందితోకూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవిచేయగా

15 యెహోవాదూత–వానికి భయపడక వానితోకూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితోకూడ రాజునొద్దకు వచ్చెను.౹

16 అతడు వచ్చి రాజును చూచి–విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.౹

17 ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను.౹

18 అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/1-bb92e5569aae9d970710501dfb1d9ca9.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *