Categories
2 పేతురు

2 పేతురు 2

1 మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటు వలెనే మీలోను అబద్ధబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.౹

2 మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.౹

3 వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.౹

4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.౹

5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికిజలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.౹

6 మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,౹

7 దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.౹

8 ఆ నీతిమంతుడు వారిమధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.౹

9-10 భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్చా పరులునై మహాత్ములనుదూషింప వెరువకయున్నారు.౹

11 దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.౹

12 వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములనుగూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాముచేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,౹

13 ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు.౹

14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాపగ్రస్తులునైయుండి,౹

15 తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.౹

16 ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతి క్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.౹

17 వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.౹

18 వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.౹

19 తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా౹

20 వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.౹

21 వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.౹

22 కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2PE/2-8f7655f547096c8410f93a70fa7f4eea.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *