Categories
1 సమూయేలు

1 సమూయేలు 31

1 అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు

2 సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.౹

3 యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు

4 –సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.౹

5 సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తిమీదపడి అతనితోకూడ మరణమాయెను.౹

6 ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులును అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి.౹

7 లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును, యొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారిపోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండుటయు చూచి తమ నివాసగ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చివాటిలో కాపురముండిరి.

8 మరునాడు ఫిలిష్తీయులు హతమైనవారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతముమీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని

9 అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి.౹

10 మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.౹

11 అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిగురించిన వార్త యాబేష్గిలాదువారు విని

12 బలశాలులందరు లేచి రాత్రియంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి

13 వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/31-97697e960893c6f8001518b8ce54f3d5.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *