1 ఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి, వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.౹
2 అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.౹
3 సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి
4 అతని యొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను.౹
5 సోబారాజైన హదదెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులురాగా దావీదు ఆ సిరియనులలో ఇరువదిరెండువేలమందిని హతముచేసెను.౹
6 తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.౹
7 మరియు హదదెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.౹
8 హదదెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులోనుండియు, కూనులోనుండియు దావీదు బహువిస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.౹
9 దావీదు సోబారాజైన హదదెజెరుయొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైన తోహూకు వినబడెను.౹
10 హదదెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదదెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములు పలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.౹
11 ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.౹
12 మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేలమందిని హతము చేసెను.౹
13 దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.
14 ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగించెను.౹
15 సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధి పతియైయుండెను; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపుదస్తావేజులమీద నుండెను;౹
16 అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;౹
17 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియైయుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/18-d5d48736e13956c295252c6384b9a3df.mp3?version_id=1787—