Categories
లేవీయకాండము

లేవీయకాండము 21

1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.౹

2 యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము–మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్తసంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు,౹

3 తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును.౹

4 అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసికొనరాదు.౹

5 వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.౹

6 వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావునవారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావునవారు పరిశుద్ధులై యుండవలెను.౹

7 వారు జారస్త్రీనేగాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లిచేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.౹

8 అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావ లెను.౹

9 మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచుకొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.

10 ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;౹

11 అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననేగాని తన తల్లి శవమువలననేగాని తన్ను అపవిత్రపరచుకొన రాదు.౹

12 దేవుని అభిషేకతైలము అనెడు కిరీటముగా అతనిమీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను

13 అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.౹

14 విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొనవలెను.౹

15 యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.

16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

17 –నీవు అహరోనుతో ఇట్లనుము–నీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.౹

18 ఏలయనగా ఎవనియందు కళంకముండునోవాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడేగాని

19 కాలైనను చేయైనను విరిగినవాడేగాని

20 గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గలవాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.౹

21 యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.౹

22 అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.౹

23 మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/21-47f3d9737be724529ebb9ea24e85be9e.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *