1 మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను.౹
2 వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలమువచ్చుచున్నది.౹
3 వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు.౹
4 అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతోకూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.౹
5 ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను –నీవు ఎక్కడికి వెళ్లు చున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని౹
6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది.౹
7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్తమీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.౹
8 ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.౹
9-11 లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.౹
12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు.౹
13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైనఆత్మవచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹
14 ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.౹
15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.౹
16 కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.౹
17 కాబట్టి ఆయన శిష్యులలో కొందరు–కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పుకొనిరి.౹
18 –కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి.౹
19 వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను–కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా?౹
20 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹
21 స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.౹
22 అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.౹
23 ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹
24 ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.
25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.౹
26 ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.౹
27 మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.౹
28 నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
29 ఆయన శిష్యులు–ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.౹
30 సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా౹
31 యేసు వారిని చూచి–మీరిప్పుడు నమ్ము చున్నారా?౹
32 యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.౹
33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/16-63a95cf62d2402aa44641bfa6deacfa3.mp3?version_id=1787—