1 చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండ యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ జేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల వృద్ధుడాయెను.౹
2 అప్పుడతడు ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను–నేను బహు సంవ త్సరములు గడచిన ముసలివాడను.౹
3 మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తజనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే.౹
4 చూడుడి, యొర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రమువరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని.౹
5 మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువకుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీన పరచుకొందురు.౹
6 కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక
7 మీయొద్ద మిగిలియున్న యీ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక
8 మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను.౹
9 యెహోవా బలముగల గొప్ప జనములను మీ యెదుటనుండి కొట్టివేసియున్నాడు, మీ యెదుట నేటివరకును ఏ మనుష్యుడును నిలిచియుండలేదు.౹
10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును
11 కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
12 అయితే మీరు వెనుకకు తొలగి మీయొద్ద మిగిలియున్న యీ జనములను హత్తుకొని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసినయెడల
13 మీ దేవుడైన యెహోవా మీ యెదుటనుండి యీ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ మీరు నశించువరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కలమీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్లుగాను ఉందురు.౹
14 ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్లుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచిమాటలన్ని టిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.౹
15 అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును.౹
16 మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరించినయెడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన యీ మంచి దేశములో నుండకుండ మీరు శీఘ్రముగా నశించి పోవుదురు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOS/23-c81689aa4441f0e1d9fc1e2d33224b5d.mp3?version_id=1787—