Categories
యిర్మీయా

యిర్మీయా 36

1 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము నాలుగవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 – నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములనుగూర్చియు నేను నీతో పలి కిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.౹

3 నేను యూదావారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.౹

4 యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.౹

5 యిర్మీయా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–నేను యెహోవా మందిరములోనికి రాకుండ నిర్బంధింపబడితిని.౹

6 కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.౹

7 ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒక వేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.౹

8 ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించెను.

9 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవాపేరట ఉపవాసము చాటింపగా

10 బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరు వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములోనుండి చదివి వినిపించెను.౹

11 షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని

12 రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి యుండిరి.౹

13 బారూకు ప్రజలందరికి వినబడునట్లు ఆ పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా

14 ప్రధానులందరు కూషీకి ఇనుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకు నొద్దకు పంపి–నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞ నియ్యగా నేరీయా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చెను.౹

15 అతడు రాగా వారు–నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను.౹

16 వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొని–మేము నిశ్చయముగా ఈ మాట లన్నిటిని రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి.౹

17 మరియు–ఈ మాటలన్నిటిని అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి? అది మాకు తెలియజెప్పుమని వారడుగగా

18 బారూకు–అతడు నోటనుండియే యీ మాటలన్నిటిని పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను.౹

19 నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి

20 శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.౹

21 ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖకుడైన ఎలీ షామా గదిలోనుండి దాని తీసికొని వచ్చి రాజు వినికిడిలోను రాజనొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోను దాని చదివెను.౹

22 తొమ్మిదవ మాసమున రాజు శీత కాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.౹

23 యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని

24 రాజైనను ఈ మాట లన్నిటిని వినిన యతని సేవకులలో ఎవరైనను భయపడ లేదు, తమ బట్టలు చింపుకొనలేదు.౹

25 –గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయును గెమర్యాయును రాజుతో మనవిచేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను.౹

26 లేఖకుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవావారిని దాచెను.

27 యిర్మీయా నోటిమాటనుబట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

28 –నీవు మరియొక గ్రంథము తీసికొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.౹

29 మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెను–యెహోవా సెలవిచ్చునదేమనగా–బబులోనురాజు నిశ్చయముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;౹

30 అందుచేతను యూదారాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.౹

31 నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారిమీదికిని యెరూషలేము నివాసులమీదికిని యూదా జనులమీదికిని రప్పించుచున్నాను; అయినను వారు వినినవారుకారు.౹

32 యిర్మీయా యింకొక గ్రంథమును తీసికొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకుచేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటిమాటలనుబట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను; మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/36-cafe144e9ca6e307e872d55cabf66735.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *