Categories
యిర్మీయా

యిర్మీయా 2

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.౹

3 అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు.

4 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.౹

5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?

6 ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు.౹

7 దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.౹

8 యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్‍ప్రయోజనమైనవాటిని అనుసరింతురు

9 కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.౹

10 కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?

11 దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.౹

12 ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.౹

13 నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.౹

14 ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను?

15 కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశమును పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను.౹

16 నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.౹

17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹

18 నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.౹

19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

20 పూర్వకాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని–నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.౹

21 శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతానమైతివి?

22 నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.౹

23 –నేను అపవిత్రత నొందినదానను కాను, బయలుదేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,౹

24 అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.౹

25 జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు–ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.౹

26 దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు–నీవు మా తండ్రివని మ్రానుతోను –నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.౹

27 వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములో–లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.౹

28 నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.

29 మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.౹

30 నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.౹

31 ఈ తరమువారలారా, యెహోవా సెలవిచ్చుమాట లక్ష్యపెట్టుడి–నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతిమి; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?

32 కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.౹

33 కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.౹

34 మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.౹

35 అయినను నీవు–నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగో–పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.౹

36 నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.౹

37 చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/2-8d04ea3bbe924cdfbf0ed968816aa86d.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *