Categories
యిర్మీయా

యిర్మీయా 12

1 యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?

2 నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల నిచ్చుచున్నారు; వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు.౹

3 యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచుచున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱెలనువలె వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము.౹

4 భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి.౹

5 –నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు?

6 నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు.

7 నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను; నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువులచేతికి అప్పగించియున్నాను.౹

8 నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహమువంటిదాయెను; ఆమె నామీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని.౹

9 నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగు చేయుడి; మ్రింగివేయుటకై అవి రావలెను.౹

10 కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.౹

11 వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను.౹

12 పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.౹

13 జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు.

14 నేను నాజనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారినిగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను వారి దేశములోనుండి వారిని పెల్లగింతును; మరియు వారి మధ్యనుండి యూదావారిని పెల్లగింతును.౹

15 వారిని పెల్లగించిన తరువాత నేను మరల వారియెడల జాలిపడుదును; ఒక్కొకని తన స్వాస్థ్యమునకును ఒక్కొకని తన దేశమునకును వారిని రప్పింతును.౹

16 బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామమునుబట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజలమార్గములను జాగ్రత్తగా నేర్చుకొనినయెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు.౹

17 అయితే వారు నా మాట విననొల్లని యెడల నేను ఆ జనమును వేరుతో పెల్లగించి బొత్తిగా నాశనము చేతును; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/12-53d4fe1adb1b85f5072b9beb26dd65ef.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *