Categories
ఫిలిప్పీయులకు

ఫిలిప్పీయులకు 2

1 కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమవలన ఆదరణయైనను,ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల౹

2 మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుం చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.౹

3 కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు౹

4 మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.౹

5 క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.౹

6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని౹

7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.౹

8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.౹

9-10 అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,౹

11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాల మందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.౹

13 ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.౹

14-15 మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.౹

16 అట్టి జనముమధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును.౹

17 మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును.౹

18 ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.

19 నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపు టకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.౹

20 మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు.౹

21 అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసు క్రీస్తు కార్యములను చూడరు.౹

22 అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్తవ్యాపకము నిమిత్తము సేవ చేసెను.౹

23 కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచినవెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను.౹

24 నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను.౹

25 మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించినవాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.౹

26 అతడు రోగియాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడు చుండెను.౹

27 నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.౹

28 కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించునిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.౹

29-30 నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్కపని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PHP/2-30b024c9a626155b7166ab5455155dce.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *