Categories
ప్రసంగి

ప్రసంగి 8

1 జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చబడును.౹

2 నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పు చున్నాను.౹

3 రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము.౹

4 రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయుపని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు?

5 ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.౹

6 ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును.౹

7 సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు?

8 గాలి విసరకుండ చేయుటకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొర కదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.౹

9 సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.

10 మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతినొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థులవలన మరువ బడియుండుటయు నేను చూచితిని; ఇదియు వ్యర్థమే.౹

11 దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్ క్రియలు చేయుదురు.౹

12 పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులుకలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు,౹

13 భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును.౹

14 వ్యర్థమైనది మరియొకటి సూర్యునిక్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది; నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది; ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని.౹

15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడ వలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.౹

16 జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్రకానకుండ మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా

17 దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని; మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూను కొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలిసి కొంటిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ECC/8-4934789d9c63724f54aae9f4a8d5c158.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *