Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 7

1 నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత

2 నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు,౹

3 నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.౹

4 నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.౹

5 కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.౹

6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.౹

7 మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా.౹

8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములోనుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.౹

9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.౹

10 ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యముచేయక బహిరంగముగా వానికి దండన విధించును

11 కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచు కొనవలెను.

12 మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును.౹

13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును.౹

14 సమస్త జనములకంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికేగాని ఆడుదానికేగాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైన నుండదు.౹

15 యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.౹

16 మరియు నీ దేవుడైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.౹

17 ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగల నని నీవనుకొందువేమో, వారికి భయపడకుము.౹

18 నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించి నప్పుడు

19 నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును.౹

20 మరియు మిగిలినవారును నీ కంటబడక దాగినవారును నశించువరకు నీ దేవుడైన యెహోవావారి మీదికి పెద్ద కందిరీగలను పంపును.౹

21 వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు.౹

22 నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమ కరముకాదు.౹

23 అయితే నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించి వారిని నశింపజేయువరకు వారిని బహుగా తల్లడిల్లచేయును.౹

24 ఆయన వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశముక్రిందనుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేకపోవును.౹

25 వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.౹

26 దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/7-73bcee6bc28180a8caedf073c688feb1.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *