Categories
దానియేలు

దానియేలు 8

1 రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము కలిగెను.౹

2-3 నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలయి యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.౹

4 ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.౹

5 నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరుగులెత్తెను; దాని రెండు కన్నులమధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.౹

6 ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములుగల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.౹

7 నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.౹

8 ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,౹

9 ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.౹

10 ఆకాశసైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగ ద్రొక్కుచుండెను

11 ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.౹

12 అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.౹

13 అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువునుగూర్చియు కలిగిన యీ దర్శనము నెర వేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునోయనియు మాటలాడుకొనిరి.౹

14 అందుకతడు– రెండువేల మూడువందల దినములమట్టుకేయని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.

15 దానియేలను నేను ఈ దర్శనము చూచితిని; దాని తెలిసికొనదగిన వివేకము పొందవలెనని యుండగా; మనుష్యుని రూపముగల యొకడు నాయెదుట నిలిచెను.౹

16 అంతట ఊలయి నదీతీరములమధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము వింటిని; అది–గబ్రియేలూ, యీ దర్శనభావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను.౹

17 అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు–నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమునుగూర్చినదని తెలిసికొనుమనెను.౹

18 అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్రపెట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.౹

19 మరియు అతడు–ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయు చున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమునుగూర్చినది

20 నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజులను సూచించుచున్నది.౹

21 బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నులమధ్య నున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించు చున్నది.౹

22 అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములోనుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు.౹

23 వారి ప్రభుత్వముయొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తియగుచుండగా, క్రూరముఖము గలవాడును యుక్తిగలవాడునైయుండి, ఉపాయము తెలిసి కొను ఒక రాజు పుట్టును.౹

24 అతడు గెలుచునుగాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింప జేయును.౹

25 మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.౹

26 ఆ దినములనుగూర్చినదర్శనమును వివరించియున్నాను. అది వాస్తవము, అది యనేకదినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను.౹

27 ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధి గ్రస్తుడనైయుంటిని; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచువచ్చితిని. ఈ దర్శనమునుగూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుప గలవాడెవడును లేక పోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DAN/8-b9672a6d55a381dd41b970b346eafb88.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *