1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,౹
2 ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.౹
3 ఎందుకనగా మనము కూడమునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయయందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని౹
4 మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు౹
5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైనస్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.౹
6-7 మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణనుబట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.౹
8 ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని,౹
9 అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.౹
10 మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.౹
11 అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
12 నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.౹
13 ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువలేకుండ చూడుము.౹
14 మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.
15 నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము.
కృప మీ అందరికి తోడై యుండును గాక.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/TIT/3-b27962b1bdd7b3cbdf1af91a42bb90c3.mp3?version_id=1787—