బెన్యామీను వంశస్థుడైన కూషుచెప్పిన మాటల విషయమై దావీదు యెహోవానుగూర్చి పాడినది. వీణనాదసహిత గీతము.
1 యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి
యున్నాను
నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.
నన్ను తప్పించువాడెవడును లేకపోగా
2 వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ
నన్ను తప్పించుము.
3 యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసిన
యెడల
4 నాచేత పాపము జరిగినయెడల
నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడు
చేసినయెడల
5 శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము
నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము
నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము.
నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా.(సెలా.)
6 యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము
నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము
నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము
న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
7 జనములు సమాజముగా కూడి నిన్ను
చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
8 యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు
యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను
బట్టియు నా విషయములో
నాకు న్యాయము తీర్చుము.
9 హృదయములను అంతరింద్రియములను
పరిశీలించు నీతిగల దేవా,
10 దుష్టుల చెడుతనము మాన్పుము
నీతిగలవారిని స్థిరపరచుము
యథార్థ హృదయులను రక్షించు దేవుడే
నా కేడెమును మోయువాడై యున్నాడు.
11 న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును
ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
12 ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును
పదునుపెట్టును
తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు
13 వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు
తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన
పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్ధమును కనియున్నాడు.
15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు
తాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
16 వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును
వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.
17 యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/7-3fbee243371aa14d4e9ea05e2247006a.mp3?version_id=1787—