Categories
ఎజ్రా

ఎజ్రా 3

1 ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమతమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి,౹

2 యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.౹

3 వారు దేశమందు కాపురస్థులైనవారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చిరి

4 మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.౹

5 తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.౹

6 ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరముయొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.౹

7 మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి.

8 యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవనెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.౹

9 యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.౹

10 శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలురాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయితాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

11 వీరు వంతు చొప్పున కూడి–యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.౹

12 మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి.౹

13 ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/3-eca9ca8f40714423c2265f7101312c60.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *