Categories
ఆమోసు

ఆమోసు 2

1 యెహోవా సెలవిచ్చునదేమనగా–మోయాబు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.౹

2 మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును.౹

3 మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

4 యెహోవా సెలవిచ్చునదేమనగా–యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమపితరులనుసరించిన అబద్ధములను చేపెట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.౹

5 యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.

6 యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు.౹

7 దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;౹

8 తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.౹

9 దేవదారు వృక్షమంత యెత్తయినవారును సింధూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,౹

10 మరియు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.౹

11 మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగానునియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.౹

12 అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.౹

13 ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.౹

14 అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొనజాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొనజాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును.౹

15 విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.౹

16 మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యముగలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/2-5943e1191f879edf6c6320e5f7e7c830.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *